మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, రెంటచింతల, చిలకలూరిపేట, ఎడ్లపాడు, నాదెండ్ల, నరసరావుపేట, రొంపిచర్ల, వినుకొండ, బొల్లాపల్లి, ఈపూరు, శావల్యాపురం, పెదకూరపాడు, అమరావతి, బెల్లంకొండ, అచ్చంపేట మండలాల్లో జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రాజుపాలెం, క్రోసూరు, ముప్పాళ్ల, నకరికల్లు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచవరం, గురజాల, దాచేపల్లి, నూజెండ్ల మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

37 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్

జిల్లాలోని 419 ఎంపీటీసీ స్థానాలకు గాను 382 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 37 స్థానాలకు గురువారం పోలింగ్ నిర్వహించనున్నారు. వీటిలో సత్తెనపల్లి మండలంలో 21, నూజెండ్లలో నాలుగు, చిలకలూరిపేట, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లో ఒక్కో స్థానం ఉన్నాయి.

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్ కృతికా శుక్లా బుధవారం పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, సీసీటీవీ, బారికేడ్లు, పోలీసు బందోబస్తు వంటి సదుపాయాలను తనిఖీ చేశారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఓటర్ల జాబితాలు సహా అవసరమైన సామగ్రిని పరిశీలించి, సిబ్బందికి భోజనం, వసతి, వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

నవంబర్ 7న ఓట్ల లెక్కింపు: జేసీ

ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జాయింట్ కలెక్టర్ సంజన శ్రీహర్ష తెలిపారు. నవంబర్ 5న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందని, నవంబర్ 7న ఓట్ల లెక్కింపు చేపడతామని వెల్లడించారు.

నరసరావుపేటలోని ఏఎం రెడ్డి కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆమె భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

By Ramya