ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి దివ్య మిత్తల్ సివిల్ సర్వీసెస్‌కు రాజీనామా చేసిన కొద్ది రోజులకే తన రాజకీయ ప్రవేశంపై స్పష్టత ఇచ్చారు. రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాను రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు. అయితే, ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని ఆమె స్పష్టం చేశారు.

బాధ్యతాయుతమైన పాలన అందించడం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని దివ్య మిత్తల్ తెలిపారు. సాధారణ పౌరుల భాగస్వామ్యంతో కొత్త తరహా రాజకీయ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రయత్నానికి ప్రజలందరూ సహకరించాలని ఆమె కోరారు. ఇంతకీ దివ్య మిత్తల్ రాజకీయ ప్రవేశం వెనుక ఉన్న కారణాలేంటి? ఆమె చేపట్టబోయే కొత్త తరహా రాజకీయాలపై పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎంతో కష్టపడి ఐఏఎస్‌ అధికారిణిగా ఎంపికై, ఎన్నో ఏళ్లపాటు ప్రజలకు సేవలందించిన ఉత్తరప్రదేశ్‌ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్‌ అధికారిణి దివ్య మిత్తల్‌ తన తదుపరి అడుగుపై కీలక ప్రకటన చేశారు. ఐఏఎస్‌ పదవికి రాజీనామా చేసిన కొద్ది రోజులకే ఆమె రాజకీయ రంగ ప్రవేశాన్ని అధికారికంగా ప్రకటించారు. దీంతో త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఉత్తరప్రదేశ్‌ను తన ప్రధాన ‘కర్మభూమి’గా పేర్కొన్న దివ్య మిత్తల్‌.. తన రాజకీయ ప్రయాణాన్ని కూడా అక్కడి నుంచే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అయితే, ప్రస్తుతం ఉన్న ఏ రాజకీయ పార్టీలోనూ చేరే ఉద్దేశం లేదని ఆమె స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి ప్రజల ప్రత్యక్ష మద్దతుతోనే అడుగుపెట్టి, స్వతంత్రంగా ముందుకు సాగుతానని ఆమె తెలిపారు.

2013 బ్యాచ్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారిణి మిర్జాపూర్, దేఓరియా జిల్లాల కలెక్టర్‌గా సుదీర్ఘకాలం సేవలందించారు. అయితే ఆమె రాజీనామాను ప్రభుత్వం సెప్టెంబర్‌లోనే ఆమోదించింది. అప్పటి నుంచి ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అంతేకాకుండా ఆమె ఏ రాజకీయ పార్టీలో చేరబోతున్నారనే దానిపై కూడా పలు ఊహాగానాలు వెలువడ్డాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తన రాజీనామాపై వస్తున్న ప్రశ్నలకు స్పష్టత ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో తన నిర్ణయానికి గల కారణాలను వెల్లడించారు.

అత్యున్నత స్థాయి సివిల్ సర్వీస్ పదవిని వదిలి రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారనే ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వినిపించని, ఒకవేళ వినిపించినా పట్టించుకోని సామాన్య ప్రజల గొంతుకగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి దాదాపు 80 ఏళ్లు పూర్తవుతున్నప్పటికీ, నిరుపేదలు ఎదుర్కొంటున్న సమస్యలకు తగిన జవాబుదారీతనం లేకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు లేకుండా, పౌరుల భాగస్వామ్యంతో మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో సరికొత్త రాజకీయ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.