
రోజంతా సోషల్ మీడియా స్క్రోలింగ్ చేస్తే జీతం ఇస్తారట.. వినూత్న ఉద్యోగ ప్రకటన చేసిన ఉదయ్‌పూర్ కంపెనీ
సాధారణంగా ఉద్యోగం అంటే ఉదయం ఆఫీసుకు వెళ్లి రోజంతా పని చేసి సాయంత్రం ఇంటికి రావడం. కానీ ఓ కంపెనీ మాత్రం ఇందుకు భిన్నంగా వినూత్న ఉద్యోగ అవకాశాన్ని ప్రకటించింది. ఈ ఉద్యోగంలో రోజంతా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ, కొత్త ట్రెండ్స్‌ను గుర్తిస్తే సరిపోతుంది. ఇందుకు జీతం కూడా చెల్లిస్తామని కంపెనీ ప్రకటించింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన ఓ సంస్థ ఈ ఉద్యోగ ప్రకటన చేసింది.
డూమ్స్క్రోలర్గా ఉద్యోగ అవకాశం
ఉదయ్‌పూర్‌కు చెందిన ఇన్ఫ్లూయిష్ (Influish) అనే కంపెనీ ఈ పోస్టు కోసం అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఈ ఉద్యోగానికి ‘డూమ్స్క్రోలర్’ (Doomscroller) అని పేరు పెట్టింది. అంటే గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేస్తూ గడిపే వ్యక్తి అని అర్థం.
అయితే ఈ ఉద్యోగంలో కేవలం రీల్స్ చూస్తూ సమయం గడిపితే సరిపోదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ వీడియోలు వైరల్ అవుతున్నాయి? ఎలాంటి కంటెంట్‌ను ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు? కొత్తగా ఎలాంటి ట్రెండ్స్ వస్తున్నాయి? అనే అంశాలను పరిశీలించి కంపెనీకి తెలియజేయాలి.
ఈ ఉద్యోగానికి సంబంధించిన వివరాలను కంపెనీ సిబ్బంది సోషల్ మీడియా వీడియో ద్వారా వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌ను ఎక్కువగా ఉపయోగించే వారు తమ అలవాటునే ఆదాయ మార్గంగా మార్చుకోవచ్చని తెలిపారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఈ ఉద్యోగంపై ఆసక్తి ఉన్నవారు కంపెనీ షేర్ చేసిన వీడియో కింద కామెంట్లో ‘Hi’ అని టైప్ చేయాలి. ఉదయ్‌పూర్‌లో నివసించే అభ్యర్థులకు దరఖాస్తు లింక్‌ను డైరెక్ట్ మెసేజ్ ద్వారా పంపిస్తామని కంపెనీ తెలిపింది.
ఆ లింక్ ద్వారా ఓపెన్ అయ్యే ఫామ్‌లో అభ్యర్థులు తమ పేరు, ఫోన్ నంబర్, చిరునామా వంటి వివరాలను నమోదు చేయాలి. ఫుల్‌టైమ్ ఉద్యోగం కావాలా? లేక ఇంటర్న్‌షిప్ కావాలా? అనేది పేర్కొనాలి. అలాగే దరఖాస్తు చేస్తున్న పోస్టు, ప్రస్తుతం తీసుకుంటున్న జీతం, ఆశిస్తున్న వేతనం వివరాలను అందించాలి. చివరగా రెజ్యూమ్ అప్లోడ్ చేసి దరఖాస్తును సమర్పించాలి. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను కంపెనీ సంప్రదిస్తుంది.
ఇప్పటికే 11 వేల మందికి పైగా ఆసక్తి
ఈ వినూత్న ఉద్యోగ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే 11 వేల మందికి పైగా అప్లికేషన్ ఫామ్ కోసం అభ్యర్థించినట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ ఉద్యోగంపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. ‘ఇదే కదా పర్ఫెక్ట్ జాబ్ అంటే’, ‘ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నా’, ‘ఇది నా డ్రీమ్ జాబ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఈ ఉద్యోగం తమకు దక్కితే బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు కూడా గెలుచుకుంటామని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
For more: Live Updates in DTV Digital
మొత్తానికి రోజంతా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ గడిపే అలవాటు ఉన్నవారికి అదే పనిగా మారి ఆదాయం కూడా వస్తుందనే వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ ఉద్యోగానికి సంబంధించిన ఖచ్చితమైన జీతం వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
