అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రాజకీయంగా ఎదురుదెబ్బగా మారుతున్నాయి. కాంగ్రెస్‌లో డెమోక్రాట్లు ఆధిపత్యం ప్రదర్శిస్తుండగా, రిపబ్లికన్ పార్టీకి చెందిన అభ్యర్థులు కీలక స్థానాల్లో ఓటమి చవిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మధ్యంతర ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, ఒకవేళ తన పేరు కూడా బ్యాలెట్‌పై ఉండి ఉంటే రిపబ్లికన్లు భారీ మెజారిటీతో విజయం సాధించేవారని ట్రంప్ పేర్కొన్నారు. పార్టీకి ఎదురైన పరాజయానికి తనను బాధ్యుడిగా చూడకూడదనే సంకేతాలను ఆయన తన పోస్టు ద్వారా ఇచ్చినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు, ఎన్నికల నిర్వహణలో ట్రంప్ అనుసరించిన వైఖరిపై సొంత పార్టీ నేతల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లోనూ రిపబ్లికన్లు పట్టు కోల్పోతున్న నేపథ్యంలో ఆయన నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంప్రదాయంగా రిపబ్లికన్లకు అనుకూలంగా ఉండే స్థానాల్లోనూ డెమోక్రాట్లు విజయం సాధించడం ఆ పార్టీకి ఆందోళన కలిగిస్తోంది.

అయితే, ఎన్నికల ఫలితాలపై తన వైఖరిని ట్రంప్ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. న్యూయార్క్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఫలితాలకు తాను బాధ్యత వహించాల్సి ఉంటుందని అంగీకరించారు. అంతేకాకుండా, దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రతిపక్ష డెమోక్రాట్లతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.

ట్రంప్ తాజా వ్యాఖ్యలు రిపబ్లికన్ పార్టీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఎన్నికల ఫలితాల ప్రభావం పార్టీ భవిష్యత్ వ్యూహాలపై ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.

By Ramya