పులివెందుల: వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. పులివెందులలో నిర్వహించిన సభలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

“తిరగబడండి.. మీ అన్న మీకు తోడుగా ఉంటాడు. పులివెందులలో కొడితే రాష్ట్రం మొత్తం ఆ శబ్దం వినిపించాలి” అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పోలీసులు చంద్రబాబు కోసం కాకుండా, రాజ్యాంగాన్ని, తమ టోపీపై ఉన్న మూడు సింహాలను గౌరవిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. పోలీసులే దౌర్జన్యాలకు పాల్పడితే ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు.

రాబోయేది జగన్ 2.0

మూడేళ్లు గడిచిపోయాయని, మరో రెండేళ్లు ఓపిక పట్టాలని కార్యకర్తలకు జగన్ సూచించారు. ఆ తర్వాత వచ్చేది ‘జగన్ 2.0’ అని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో తాను మొదటి స్థానంలో ఉంటే, కార్యకర్తలకు రెండో స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత కేసులు పెట్టినా, ఇబ్బందులకు గురిచేసినా భయపడేది లేదని స్పష్టం చేశారు. తమ పార్టీ కష్టాల్లో, ప్రతిపక్షంలోనే పుట్టిందని గుర్తుచేశారు.

వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటు వేస్తే చంద్రబాబు నాయుడుకు సింగిల్ డిజిట్ కూడా రాదని జగన్ వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో పాదయాత్ర ప్రారంభిస్తానని, అది మొదలైన ఏడాదిలోనే ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు.

పులివెందుల ప్రజలతో ప్రత్యేక అనుబంధం

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత పులివెందుల ప్రజలే తన కుటుంబ సభ్యులుగా నిలిచారని జగన్ అన్నారు. తనకు ఎలాంటి కష్టం వచ్చినా వారి దగ్గరికే వస్తానని భావోద్వేగంగా పేర్కొన్నారు.

ఓటింగ్‌కు ముందు రోజు రాత్రే పులివెందులకు చేరుకుని, స్వయంగా పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేస్తానని తెలిపారు. అన్యాయం చేయడానికి ఎంతమంది వస్తారో రావాలని ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. అధికారులకు ఇప్పటికైనా మార్పు రావాలని, ప్రజాస్వామ్యబద్ధంగా విధులు నిర్వహించాలని సూచించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *