
పదో తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. స్పోర్ట్స్ కోటాలో నియామకాలు
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న క్రీడాకారులకు ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) శుభవార్త అందించింది. స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 119 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన క్రీడాకారులు 2026 నవంబర్ 10వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
- ట్యాక్స్ అసిస్టెంట్: 44 పోస్టులు
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II: 9 పోస్టులు
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): 66 పోస్టులు
విద్యార్హతలు
పోస్టులను బట్టి అభ్యర్థులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు.
- ట్యాక్స్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించే స్టెనోగ్రఫీ నైపుణ్య పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.
- MTS: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి
పోస్టుల ఆధారంగా వయోపరిమితిని నిర్ణయించారు.
- ట్యాక్స్ అసిస్టెంట్: 18 నుంచి 27 ఏళ్లు
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II: 18 నుంచి 27 ఏళ్లు
- MTS: 18 నుంచి 25 ఏళ్లు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి.
ఎంపిక విధానం.. దరఖాస్తు గడువు
ఈ నియామకాలు స్పోర్ట్స్ కోటా కింద చేపడుతున్నందున అభ్యర్థుల క్రీడా ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. క్రీడల్లో సాధించిన విజయాలు, ప్రదర్శన, విద్యార్హతలు, వయోపరిమితి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు 2026 నవంబర్ 10వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
