ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభమైన తర్వాత అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు మాస్కోపై కఠినమైన ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా చమురు ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పరిస్థితిని భారత్ ఒక అవకాశంగా మలుచుకుంది. భారీ డిస్కౌంట్లకు రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురును కొనుగోలు చేస్తోంది.

అయితే, భారత్‌ కొనసాగిస్తున్న ఈ కొనుగోళ్లపై పశ్చిమ దేశాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా ఆర్థిక సహకారం అందిస్తున్నారన్నది అమెరికా ప్రధాన ఆరోపణ.

ఈ నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై సెకండరీ టారిఫ్‌లు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కల్పించేలా చట్టంలో మార్పులు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిణామం భారత్‌పై మరింత ఆర్థిక, దౌత్యపరమైన ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.

రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేయడం వెనుక మాస్కోకు ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశం లేదని భారత్‌లో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ స్పష్టం చేశారు. భారత్ తన ఇంధన అవసరాలు, దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటోందని ఆయన పేర్కొన్నారు.

డీడీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలిపోవ్ మాట్లాడుతూ.. ‘‘రష్యాకు సహాయం చేయాలనే ఉద్దేశంతో భారత్‌ మా దేశం నుంచి చమురును కొనుగోలు చేయడం లేదు. తన సొంత ఇంధన భద్రతతో పాటు దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకుంటోంది’’ అని తెలిపారు.

రష్యా చమురు దిగుమతులపై అమెరికా ఒత్తిడి.. రష్యా రాయబారి కీలక వ్యాఖ్యలు

పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్న నేపథ్యంలో, రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై సెకెండరీ టారిఫ్‌లు విధించే అవకాశం ఉందన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాలపై రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ స్పందించారు.

రష్యా ముడిచమురు, సహజ వాయువును అత్యధికంగా కొనుగోలు చేసే ఐదు దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి కల్పించే బిల్లును అమెరికా పరిశీలిస్తోంది. రష్యా ఇంధన కొనుగోళ్ల ద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతు లభిస్తోందని, తద్వారా ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సైనిక చర్యలకు మాస్కోకు నిధులు సమకూరడం సులభమవుతోందని ఈ ప్రతిపాదనలో పేర్కొన్నారు.

అంతేకాకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు కీలక సైనిక జనరల్స్, ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు, ఇంధన ప్రాజెక్టులపై నేరుగా ఆంక్షలు విధించే ప్రతిపాదనలు కూడా ఈ బిల్లులో ఉన్నట్లు తెలుస్తోంది.

పశ్చిమ దేశాలపై రష్యా రాయబారి విమర్శలు

పశ్చిమ దేశాలు నిజాయితీగల సహకారానికి బదులుగా ఒత్తిడి, శిక్షాత్మక చర్యల మార్గాన్ని ఎంచుకుంటున్నాయని డెనిస్ అలిపోవ్ విమర్శించారు.

భారత్‌కు రష్యా కంటే మెరుగైన ధరకు చమురు అందించడాన్ని ఎవరూ అడ్డుకోవడం లేదని ఆయన అన్నారు. అయితే, అలాంటి మెరుగైన ఒప్పందాన్ని అందించడంలో పశ్చిమ దేశాలు విఫలమవుతున్నాయని పేర్కొన్నారు.

“చమురు విషయంలో భారత్‌కు రష్యా కంటే మెరుగైన డీల్‌ను అందించడాన్ని ఎవరు అడ్డుకుంటున్నారు? కానీ ఎవరూ అలా చేయలేకపోతున్నారు. అందుకే ఆంక్షలు, టారిఫ్‌లు, ఇతర శిక్షాత్మక చర్యల ద్వారా ఒత్తిడి తెస్తున్నారు” అని అలిపోవ్ వ్యాఖ్యానించారు.

భారత్–రష్యా ఇంధన వాణిజ్యంపై పశ్చిమ దేశాల ఒత్తిడి పెరుగుతున్న సమయంలో రష్యా రాయబారి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *