ఇస్రో ప్రైవేటీకరణపై వస్తున్న వార్తలకు సంస్థ స్పష్టత ఇచ్చింది. ఇస్రోను ప్రైవేటీకరించే ఆలోచన లేదని, అలాగే సంస్థ ప్రాధాన్యతను తగ్గించే ప్రసక్తే లేదని వెల్లడించింది.

అయితే రాకెట్లు, సాధారణ ఉపగ్రహాలు, ఇతర అంతరిక్ష వ్యవస్థల భారీ స్థాయి తయారీలో ప్రైవేట్ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలకు మరిన్ని అవకాశాలు కల్పించనున్నట్లు ఇస్రో తెలిపింది. ఈ విధానంతో ఇస్రో తన కీలకమైన అధునాతన పరిశోధనలపై మరింత దృష్టి సారించనుంది.

ముఖ్యంగా మానవ అంతరిక్ష యాత్ర, తదుపరి తరం లాంచ్ సిస్టమ్స్‌, చంద్రుడు, ఇతర గ్రహాల అన్వేషణతో పాటు వ్యూహాత్మక మిషన్లపై ఇస్రో ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనుంది.

ఇస్రో ప్రైవేటీకరణపై స్పష్టత.. వార్తలు అవాస్తవం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రైవేటీకరణకు సంబంధించిన వార్తలకు తెరపడింది. ఇస్రోను ప్రైవేటీకరించే ఉద్దేశం లేదని ఆ సంస్థ స్పష్టం చేసింది. సంస్థ ప్రాధాన్యతను తగ్గించే ప్రశ్నే లేదని తేల్చిచెప్పింది. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ కంపెనీలు, స్టార్టప్‌లు, విద్యాసంస్థల భాగస్వామ్యాన్ని పెంచేందుకు చేపడుతున్న సంస్కరణలను ప్రైవేటీకరణగా భావించకూడదని పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ఇస్రో అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఇటీవల ఇస్రోకు చెందిన పలు ఉద్యోగ సంఘాలు సంస్థ భవిష్యత్ పాత్రపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఇస్రో ప్రస్తుతం నిర్వహిస్తున్న రాకెట్లు, ఉపగ్రహాల తయారీతో పాటు కొన్ని కార్యకలాపాలను ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించే ప్రతిపాదనలు ఉన్నాయంటూ వార్తలు వెలువడ్డాయి. దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు ఈ నెల 4న ఇస్రో చైర్మన్ వి. నారాయణన్‌కు లేఖ రాశాయి.

ఉద్యోగులు, వారి కుటుంబాల్లో ఆందోళనకు కారణమైన ఈ వార్తలపై ఇస్రో కీలక వివరణ ఇచ్చింది. సంస్థను ప్రైవేటీకరించే ఆలోచన లేదని, అలాగే దాని ప్రాధాన్యతను తగ్గించబోమని స్పష్టం చేసింది.

దేశంలో అధునాతన అంతరిక్ష పరిశోధన, సాంకేతిక అభివృద్ధి, జాతీయ, వ్యూహాత్మక మిషన్లు, అంతరిక్ష శాస్త్రం, గ్రహాల అన్వేషణ, కీలక సాంకేతిక సామర్థ్యాల అభివృద్ధిలో ఇస్రోనే ప్రధాన సంస్థగా కొనసాగుతుందని వెల్లడించింది.

అదే సమయంలో అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగం విస్తరించడం వల్ల ఇస్రో పాత్ర తగ్గదని పేర్కొంది. ఇప్పటికే సాంకేతికంగా పరిపక్వత సాధించిన వ్యవస్థలను భారీ స్థాయిలో తయారు చేసే బాధ్యతలను పరిశ్రమలకు అప్పగిస్తే, ఇస్రో తన శాస్త్రీయ, సాంకేతిక నైపుణ్యాలు, వనరులను మరింత అధునాతన పరిశోధనలు, కొత్త సాంకేతికతల అభివృద్ధిపై కేంద్రీకరించేందుకు అవకాశం ఏర్పడుతుందని వివరించింది.

అందువల్ల అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని పెంచే చర్యలను ఇస్రో ప్రైవేటీకరణగా చూడకూడదని సంస్థ స్పష్టం చేసింది.

సాంకేతికంగా పరిపక్వమైన రాకెట్లు, సాధారణ ఉపగ్రహాలు, ఇతర అంతరిక్ష వ్యవస్థల భారీ ఉత్పత్తిని భవిష్యత్తులో పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు పోటీ ప్రాతిపదికన చేపట్టే అవకాశం ఉందని ఇస్రో వెల్లడించింది. అయితే, ఈ ప్రక్రియ వల్ల ఇస్రో తన కీలక బాధ్యతల నుంచి తప్పుకుంటుందని భావించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

అంతరిక్ష రంగంలో ఫ్రాంటియర్‌ రీసెర్చ్‌, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలు, నెక్స్ట్‌ జనరేషన్‌ లాంచ్‌ సిస్టమ్స్‌, చంద్రుడు మరియు ఇతర గ్రహాల అన్వేషణతో పాటు జాతీయ భద్రతకు అవసరమైన వ్యూహాత్మక సామర్థ్యాల అభివృద్ధిపై ఇస్రో మరింతగా దృష్టి సారించనుంది.

భారత్‌ రూపొందించిన ‘స్పేస్‌ విజన్‌ 2047’లో భాగంగా 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, 2040 నాటికి భారతీయ వ్యోమగాములను చంద్రుడిపైకి పంపడం వంటి ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను నిర్దేశించింది. అలాగే పునర్వినియోగ లాంచ్‌ వాహనాల అభివృద్ధి, చంద్రుడు సహా ఇతర గ్రహాలపై దీర్ఘకాలిక పరిశోధనలు చేపట్టడం కూడా ఈ ప్రణాళికలో కీలక భాగాలుగా ఉన్నాయి.

ఇలాంటి భారీ ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేయాలంటే అత్యాధునిక పరిశోధన, ప్రత్యేక శాస్త్రీయ నైపుణ్యం, కొత్త సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి అవసరమని ఇస్రో పేర్కొంది. ఇప్పటికే నిరూపితమైన సాంకేతికతలను పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తే.. ఇస్రోకు తయారీ బాధ్యతల నుంచి కొంత వెసులుబాటు లభిస్తుంది. దీంతో తదుపరి తరం అంతరిక్ష సాంకేతికతలు, అత్యాధునిక పరిశోధనలపై సంస్థ మరింతగా దృష్టి కేంద్రీకరించేందుకు అవకాశం ఏర్పడుతుందని ఇస్రో వివరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *