తమిళనాడు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి విజయ్ మహిళల గౌరవం, రాజకీయాల్లో హుందాతనంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నటి త్రిషను ఉద్దేశించి ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ వివాదం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.

ఈ సందర్భంగా సీఎం విజయ్ స్పందిస్తూ.. రాజకీయ విమర్శలు హద్దులు దాటకూడదని స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలను కించపరిచేలా, అసభ్యకరంగా లేదా ద్వంద్వార్థాలు వచ్చేలా చేసే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన తేల్చి చెప్పారు.

అయితే, తనపై వచ్చిన ఈ ఆరోపణలను ఉదయనిధి స్టాలిన్ ఖండించారు. అవన్నీ నిరాధారమైన ఆరోపణలేనని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో మరింత చర్చనీయాంశంగా మారింది.

అసలు వివాదం ఏమిటి? సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యల వెనుక కారణమేంటి? ఉదయనిధి స్టాలిన్ ఏం వివరణ ఇచ్చారు? ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

తమిళనాడు రాజకీయాల్లో మహిళలను ఉద్దేశించి జరుగుతున్న అనుచిత, దిగజారుడు వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భావప్రకటనా స్వేచ్ఛను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని, దాని పేరుతో మహిళలను అవమానించేలా లేదా అభ్యంతరకరంగా మాట్లాడటం ఏమాత్రం సమర్థనీయం కాదని హెచ్చరించారు.

రాజకీయ ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేయడం సహజమే అయినప్పటికీ.. మహిళల పట్ల అసభ్యకర పదజాలం, డబుల్ మీనింగ్, త్రిబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని విజయ్ స్పష్టం చేశారు. మహిళలే తన రాజకీయ విజయానికి ప్రధాన బలంగా నిలిచారని పేర్కొన్న ఆయన.. ప్రతి ఒక్కరూ ఇంట్లో తల్లి, చెల్లెలు ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకుని మాట్లాడాలని హితవు పలికారు.

ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో అసభ్యత, వ్యక్తిగత విమర్శలు, కక్షసాధింపు ధోరణులు పెరిగిపోతున్నాయని విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసే వారిపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలు హుందాగా, ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా ఉండాలని సూచించారు.

ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ నటి త్రిషను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన కొద్ది రోజులకే సీఎం విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా ఆగస్టులో జరిగిన కావేరి నిరసన సభలో ఉదయనిధి ద్వందార్థ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆయన అరెస్టు కూడా అయ్యారు.

అయితే ఈ ఆరోపణలను డీఎంకే వర్గాలు తీవ్రంగా ఖండించాయి. సంబంధిత వీడియోను ఉద్దేశపూర్వకంగా ఎడిట్ చేసి, ఉదయనిధి వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేశారని, ఇది రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగమని వారు ఆరోపించారు.

ఇదే సందర్భంలో గతంలో మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత కూడా అసెంబ్లీలోనే అవమానానికి గురైన ఘటనను సీఎం విజయ్ ప్రస్తావించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను, ఇతరులను కించపరిచేలా మాట్లాడే ధోరణిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో విజయ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *