Indian Railways Announces Fare Cuts on 47 Trains, Tickets to Become Cheaper by Up to ₹75 from January 1, 2027

రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా 47 సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ మార్పుతో ఆయా రైళ్లలో ప్రయాణించే వారికి టికెట్ ధరలు తగ్గనున్నాయి. ప్రయాణించే తరగతిని బట్టి ఒక్కో టికెట్‌పై రూ.15 నుంచి రూ.75 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఈ కొత్త ధరలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

జనవరి 1 నుంచి కొత్త విధానం

రైల్వే నిబంధనల ప్రకారం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రెండు దిశల్లోనూ గంటకు కనీసం 55 కిలోమీటర్ల సగటు వేగాన్ని అందుకోవాలి. అయితే రైల్వేశాఖ నిర్వహించిన పరిశీలనలో 47 రైళ్లు ఈ ప్రమాణాలను చేరుకోలేకపోయినట్లు గుర్తించింది. దీంతో వాటికి సూపర్‌ఫాస్ట్ హోదాను తొలగించి సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చాలని నిర్ణయించింది.

సూపర్‌ఫాస్ట్, సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్ల టికెట్ ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జీ తొలగిపోవడంతో ప్రయాణికులకు టికెట్ ధరలు తగ్గనున్నాయి. ఈ మార్పుతో రైళ్ల నంబర్లు, సర్‌ఛార్జీలు మారనున్నప్పటికీ ప్రస్తుతానికి రైళ్ల సమయాల్లో ఎలాంటి మార్పు ఉండదని సమాచారం.

సెంట్రల్ రైల్వే పరిధిలో CSMT–పూణే ప్రగతి ఎక్స్‌ప్రెస్, LTT–అయోధ్య కంటోన్మెంట్ తులసి ఎక్స్‌ప్రెస్‌తో పాటు 18 సర్వీసులు ఈ జాబితాలో ఉన్నాయి. ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో సప్త క్రాంతి సహా 20 రైళ్లు ఉన్నాయి. ఉత్తరాఖండ్ మార్గాల్లో తానక్‌పూర్–ఢిల్లీ, డెహ్రాడూన్–కాఠ్‌గోడమ్ రైళ్లతో పాటు మరో ఎనిమిది సర్వీసులు ఉన్నాయి. గోవా ఎక్స్‌ప్రెస్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది.

Live Updates in DTV Digital

ఏ క్లాస్ టికెట్‌పై ఎంత తగ్గుతుందంటే?

కొత్త నిర్ణయం అమల్లోకి వస్తే ప్రయాణ తరగతిని బట్టి టికెట్ ధరల్లో ఈ మేరకు తగ్గింపు ఉండనుంది.

  • సెకండ్ క్లాస్: రూ.15 వరకు తగ్గింపు
  • స్లీపర్ క్లాస్: రూ.30 వరకు తగ్గింపు
  • ఏసీ చైర్ కార్: రూ.45 వరకు తగ్గింపు
  • ఏసీ థర్డ్ టైర్: రూ.45 వరకు తగ్గింపు
  • ఏసీ సెకండ్ టైర్: రూ.45 వరకు తగ్గింపు
  • ఏసీ ఫస్ట్ క్లాస్: రూ.75 వరకు తగ్గింపు

తమిళనాడులోనూ పలు రైళ్లకు మార్పులు

దక్షిణ రైల్వే పరిధిలో తమిళనాడుకు చెందిన ఎనిమిది రైళ్లను కూడా సాధారణ ఎక్స్‌ప్రెస్ సర్వీసులుగా మార్చనున్నట్లు సమాచారం. వీటిలో చెన్నై ఎగ్మోర్–రామేశ్వరం, తాంబరం–తిరుచిరాపల్లి రైళ్లు ఉన్నాయి.

ఈ మార్పులు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకునే సమయంలో కొత్త రైలు నంబర్లను తప్పనిసరిగా గమనించాలని రైల్వేశాఖ సూచించింది. కొత్త ఛార్జీలు జనవరి 1 నుంచి రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థలో అప్‌డేట్ కానున్నాయి. ఈ నిర్ణయంతో తరచూ రైళ్లలో ప్రయాణించే సామాన్యులకు కొంత ఆర్థిక ఊరట లభించనుంది.