న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక స్పష్టత ఇచ్చింది. వాహన బీమా గడువు ముగియనుందంటూ మొబైల్ ఫోన్లకు వస్తున్న ఎస్‌ఎంఎస్ అలర్ట్‌లపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భాగంగానే ఈ సందేశాలను పంపుతున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం ఎంపిక చేసిన కొంతమంది వాహనదారులకు మాత్రమే ఈ మెసేజ్‌లు పంపుతున్నామని, ఈ కార్యక్రమం ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉందని ఎన్‌హెచ్‌ఏఐ స్పష్టం చేసింది.

ఇన్సూరెన్స్ గడువు ముగిస్తే టోల్ ప్లాజాల వద్ద చలాన్లు పడతాయా?

వాహన బీమా గడువు ముగిసిన వెంటనే టోల్ ప్లాజాల వద్ద ఆటోమేటిక్‌గా చలాన్లు జారీ అవుతాయన్న ప్రచారంలో వాస్తవం లేదని ఎన్‌హెచ్‌ఏఐ తేల్చిచెప్పింది. ఇన్సూరెన్స్ గడువు ముగిసిన కారణంగా మాత్రమే టోల్ ప్లాజాల వద్ద జరిమానాలు విధించబోమని స్పష్టం చేసింది. వాహనదారులకు పంపుతున్న ఇన్సూరెన్స్ రెన్యువల్ ఎస్‌ఎంఎస్‌లకు, టోల్ ప్లాజాల వద్ద విధించే జరిమానాలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.

వాహనదారులను అప్రమత్తం చేయడమే లక్ష్యం

వాహనదారులు తమ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ గడువు ముగిసే తేదీని గుర్తుంచుకుని, ముందుగానే రెన్యువల్ చేసుకునేలా అప్రమత్తం చేయడమే ఈ సందేశాల ప్రధాన ఉద్దేశం. పాలసీ గడువు ముగియకముందే పునరుద్ధరించుకోవడం ద్వారా వాహనాలకు నిరంతర బీమా రక్షణ లభిస్తుందని అధికారులు తెలిపారు.

రోడ్డు భద్రత, బాధ్యతాయుతమైన వాహన వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు.

అందువల్ల మొబైల్ ఫోన్లకు వచ్చే ఇన్సూరెన్స్ రెన్యువల్ సందేశాలను చూసి టోల్ ప్లాజాల వద్ద చలాన్లు పడతాయని వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే చట్టపరమైన నిబంధనల ప్రకారం వాహనానికి చెల్లుబాటయ్యే బీమా పాలసీ తప్పనిసరి. కాబట్టి పాలసీ గడువును ముందుగానే తనిఖీ చేసుకుని, సకాలంలో రెన్యువల్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *