
ఏపీ ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈసారి సీనియర్ ఐఏఎస్‌లు చాలామంది బదిలీ అయ్యారు. వీరిలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఎండీ కాటా ఆమ్రపాలి కూడా ఉన్నారు. ఆమెను ఈ బాధ్యతల నుంచి తప్పించి.. ఏపీటీడీసీ ఎండీగా రవి సుభాష్‌ను నియమించింది. ఆమ్రపాలి సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆమె ప్రస్తుతం సెలవులో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. వీరిలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఎండీ కాటా ఆమ్రపాలి కూడా బదిలీ అయ్యారు. దీర్ఘకాలంగా సెలవులో ఉన్న ఆమ్రపాలి కాటాను సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీటీడీసీ ఎండీగా రవి సుభాష్‌ను నియమించింది. ఆయన ప్రస్తుతం నిర్వహిస్తున్న ఏపీపీఎస్‌సీ కార్యదర్శి పోస్టుతోపాటు, ఏపీటీఏ సీఈవోగా పూర్తిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ బదిలీలలో ఐఏఎస్ ఆమ్రపాలికి ఎలాంటి పోస్ట్ ఇవ్వలేదు.. కేవలం జీఏడీలో రిపోర్టు చేయాలని సూచించారు.
2014 ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో 2010 బ్యాచ్‌కు చెందిన ఆమ్రపాలిని డీవోపీటీ (కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ) మొదట ఆంధ్రప్రదశ్‌కు కేటాయించింది. ఆమె మాత్రం తెలంగాణలోనే పనిచేశారు.. తనను డీవోపీటీ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించడాన్ని సవాలు చేస్తూ ఆమ్రపాలి క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన క్యాట్ హైదరాబాద్ బెంచ్, ఆమెను తెలంగాణ క్యాడర్‌కు కేటాయించింది. వెంటనే డీవోపీటీ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వుల్ని తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది.. ఈ పిటిషన్‌పై విచారణ చేసిన హైకోర్టు క్యాట్ తీర్పుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు స్టేతో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లారు.. రాష్ట్రప్రభుత్వం పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ (APTDC) ఎండీగా నియమించారు.
ఆమ్రపాలి ఏపీ పర్యాటకశాఖ ఎండీ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.. కానీ గత మూడు నెలలుగా వరుసగా సెలవుల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమెను బదిలీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆమె తెలంగాణ కేడర్‌లో కొనసాగేందుకు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. మరి ఏపీ ప్రభుత్వం ప్రస్తుతానికి ఆమెను జీఏడీలో రిపోర్ట్ చేయమని ఆదేశించింది. మరి ఆమ్రపాలికి ఏపీ ప్రభుత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆమె సెలవులోనే ఉన్నట్లు సమాచారం.. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. అంతేకాదు ఈ బదిలీల్లో చాలామంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు స్థానచలనం తప్పలేదు.. పాఠశాల విద్యా, సాధారణ పరిపాలనశాఖ, పర్యాటకం వంటి కీలక శాఖల్లో అధికారులు బదిలీ అయ్యారు. గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేకంగా అధికారుల్ని నియమించారు.

