
తన ఘుమఘుమలతో నిత్యం మనల్ని ఉత్సాహపరిచే కాఫీ నేడు కల్తీ రక్కసి కోరల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది. బరువు కోసం క్లే, చింత పిక్కల పొడి, కలర్ కోసం కృత్రిమ రంగులు కలపడం వల్ల తన సహజత్వాన్ని కోల్పోతోంది. తద్వారా మన ఆరోగ్యాన్ని కూడా నెమ్మదిగా ప్రమాదంలోకి నెట్టేస్తోంది. జీర్ణకోశ సమస్యలు, కిడ్నీ, లివర్ సమస్యలకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో కల్తీ కాఫీ పొడిని ఎలా గుర్తించాలి? కల్తీ కాఫీ పొడి తీసుకోవడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటి? వంటి విషయాలను తెలుసుకుందాం.
కాఫీ.. లోకాన్ని నిద్రలేపే అమృతం.. మెదడుకు పదును పెట్టే ఇంధనం. అంతేకాదు ఓ మూడ్ సెట్టర్.. ఓ స్ట్రెస్ బస్టర్. ఒక్క ముక్కలో చెప్పాలంటే టెన్షన్, ఒత్తిడికి చెక్ పెట్టి.. ఉత్సాహాన్ని రెట్టింపు చేసే ఓ టానిక్. అందుకే కోట్లాది మందికి ఇది రోజువారీ వ్యసనం. ఉదయాన్నే రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చని ఫీలవుతుంటారు చాలా మంది. అయితే ఒకప్పుడు కాఫీ అంటే రోజుకు రెండు సార్లు అది కూడా ఉదయం, సాయంత్రం మాత్రమే తాగేవారు. కానీ ప్రజెంట్ జనరేషన్లో ఎప్పుడు పడితే అప్పుడు, ఏ టైమ్‌లో అంటే ఆ టైమ్‌లో కాఫీ తాగేస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. చాలా మంది కాఫీతోనే తమ రోజును ప్రారంభిస్తున్నారు.
ఇదే అదునుగా భావిస్తున్న కల్తీ మాఫియా చేతివాటం చూపిస్తున్నారు. కల్తీ కాఫీ పౌడర్‌ను మార్కెట్‌లో అమ్మేస్తున్నారు. క్లే మరియు షికోరి పౌడర్ వంటివి కాఫీ పొడిలో కలిపేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాఫీ పౌడర్ స్వచ్ఛతను తెలుసుకునేందుకు ఆహార భద్రత సంస్థ (FSSAI) కీలక సూచనలు చేస్తోంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

