
రంగారెడ్డి జిల్లాలో ప్రతిష్టాత్మక రేడియల్ రోడ్-2 నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. శంషాబాద్-షాద్‌నగర్ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో పది రోజుల్లో భూములు సేకరించాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. రైతులతో జరిపిన చర్చలు సఫలమవడంతో ఆర్ఆర్ యాక్ట్-2013 ప్రకారం పారదర్శక పరిహారానికి రైతులు అంగీకార పత్రాలు ఇచ్చారు. బుద్వేల్ నుంచి కొడంగల్ వరకు 81 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రహదారి వల్ల శంషాబాద్, షాద్‌నగర్ ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడార్లు వేగంగా అభివృద్ధి చెందనున్నాయి.
భూసేకరణ ప్రక్రియలో రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా వారిలో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, షాద్‌నగర్ శాసనసభ్యుడు వీర్లపల్లి శంకర్ చర్యలు తీసుకున్నారు. రైతుల తరపున ప్రతినిధులతో ఉన్నత స్థాయి సంప్రదింపులు, ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ భూసేకరణ చట్టం ఆర్ఆర్ యాక్ట్-2013 నిబంధనల ప్రకారం పారదర్శకమైన పద్ధతిలో మార్కెట్ ధరకు అనుగుణంగా తగిన పరిహారాన్ని అందజేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ సానుకూల చర్చల అనంతరం భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన రైతుల నుంచి అధికారులు అధికారిక అంగీకార పత్రాలను సేకరించారు.
రేడియల్ రోడ్-2 ప్రాజెక్టును రాజధాని శివార్లలోని బుద్వేల్ నుంచి ప్రారంభించి షాబాద్, కొండూర్, పరిగి మీదుగా ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కొడంగల్ వరకూ మొత్తం 81 కిలోమీటర్ల మేర అత్యాధునిక ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే శంషాబాద్, షాబాద్ మండలాలలో ప్రతిపాదించిన పారిశ్రామిక కారిడార్లకు, కొత్తగా రాబోతున్న ఐటీ పరిశ్రమలకు అంతర్జాతీయ స్థాయి రవాణా సౌకర్యం లభించనుంది. ముఖ్యంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కార్గో టెర్మినల్ నుంచి నేరుగా షాబాద్, కొడంగల్ ప్రాంతాలల్లోని భారీ పరిశ్రమలకు అవసరమైన భారీ యంత్రాలు, ముడిపదార్థాలు, విదేశీ పరికరాలను వేగంగా, సులభంగా తరలించడానికి ఈ మార్గం అనుకూలంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

