
విశాఖపట్నం జిల్లా గుడిలోవ వేదికగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రేరణతో పనిచేస్తున్న వివిధ అనుబంధ సంస్థల అఖిల భారత సమన్వయ బైఠక్ జరగనుంది. ఈ నెల 19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు.
సామాజిక జీవితం ప్రజా చైతన్య కార్యక్రమాల్లో చురుకుగా పనిచేస్తున్న సుమారు 32 సంఘ పరివార్ అనుబంధ సంస్థలు ఈ సమావేశాల్లో పాల్గొననున్నాయి. ఆయా సంస్థల అఖిల భారత అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు సంఘటన్ మంత్రులతో పాటు కీలక కార్యవర్గ సభ్యులు భేటీకి హాజరుకానున్నారు.
భారతీయ మజ్దూర్ సంఘ్ భారతీయ కిసాన్ సంఘ్ భారతీయ జనతా పార్టీ విశ్వహిందూ పరిషత్ అఖిల భారత విద్యార్థి పరిషత్ సక్షమ్ రాష్ట్రీయ సేవికా సమితి తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధులు ఈ సమన్వయ సమావేశంలో భాగస్వాములు కానున్నారు. వివిధ రంగాల్లో కొనసాగుతున్న కార్యక్రమాలు సామాజిక అంశాలు ప్రజా చైతన్య కార్యక్రమాలపై ఈ భేటీలో పరస్పర సమన్వయంతో చర్చించే అవకాశం ఉంది.

