
ప్రజల భూ, రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
శ్రీకాకుళం డివిజన్ స్థాయి రెవెన్యూ అధికారులతో బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భూ సమస్యలు, మ్యుటేషన్లు, పట్టాదారు పాస్‌బుక్‌లు, భూ రికార్డుల సవరణలు, సరిహద్దు వివాదాలు, ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాల జారీ తదితర అంశాలపై సమీక్షించారు.
పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికీ నిర్ణీత సమయంలో సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పారదర్శకంగా, జవాబుదారీతనంతో రెవెన్యూ సేవలు అందించాలని ఆదేశించారు.
మ్యుటేషన్ ప్రక్రియపై వీఆర్వోలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టే సిబ్బంది మొబైల్ యాప్‌ల ద్వారా నివేదికలను నమోదు చేయాలని సూచించారు. భూ రికార్డులను పక్కాగా నిర్వహించడంతో పాటు 1బి డాక్యుమెంటేషన్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.
డివిజన్ పరిధిలోని సమస్యలను ఆర్డీవోలు క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పరిష్కరించిన సమస్యల వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షకు అందించాలని, పెండింగ్ అంశాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యలకు సంబంధించిన సమాచారం కింది స్థాయి సిబ్బందికి చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సర్వేయర్లు, వీఆర్వోలు కలిసి పనిచేస్తూ సాంకేతికతను వినియోగించుకోవాలని, సమస్యల పరిష్కారంలో కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతికతను కూడా ఉపయోగించుకోవాలని తెలిపారు.
సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ (శిక్షణ) హరి ఓం పాండియా, జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ఏడీ సర్వే జోషిల, ఆర్డీవో సాయి ప్రత్యూష, రెవెన్యూ పరిపాలన అధికారి సూర్యనారాయణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

