
అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు విధి నిర్వహణలో పారదర్శకత, క్రమశిక్షణ పాటించాలని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్ సిబ్బందిని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం, అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సోమవారం మహామండపంలోని నాలుగో అంతస్తు సమావేశ మందిరంలో దేవస్థానం సిబ్బందితో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు పాటించాల్సిన 18 ప్రధాన మార్గదర్శకాలను వివరించారు. తొలుత అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్. రంగారావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అధికారులు పి. చంద్రశేఖర్, ఎన్. రమేష్ బాబు, డాక్టర్ కె. గంగాధర్ విధి నిర్వహణలో పాటించాల్సిన నిబంధనలపై సిబ్బందికి సూచనలు చేశారు.
అమ్మవారి సన్నిధిలో సేవ చేసే అవకాశాన్ని పుణ్యఫలంగా భావించి ప్రతి ఉద్యోగి భక్తి, నిబద్ధతతో విధులు నిర్వహించాలని ఈవో సూచించారు. విధులకు యూనిఫాం, గుర్తింపు కార్డుతో హాజరుకావాలని, ఆలయ సంప్రదాయాలను గౌరవించాలని తెలిపారు. సమయపాలన పాటించాలని, ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
టికెట్ల జారీ, ప్రసాదాల విక్రయాలు, విరాళాల స్వీకరణ కౌంటర్లలో ప్రత్యేక అప్రమత్తత అవసరమన్నారు. ప్రతి లావాదేవీకి రశీదు ఇవ్వాలని, వ్యక్తిగత నగదు ఉంచుకోరాదని ఆదేశించారు. నగదు కౌంటర్లు, ప్రసాద నిల్వ కేంద్రాలు, కానుకల స్వీకరణ ప్రాంతాల్లో అనధికార వ్యక్తులకు ప్రవేశం కల్పించకూడదని పేర్కొన్నారు. నగదు లావాదేవీల రికార్డులను అధికారుల ధ్రువీకరణతో నిర్వహించాలని సూచించారు.
భక్తులతో మర్యాదగా వ్యవహరించాలి
ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడితో గౌరవంగా వ్యవహరించాలని, వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, చిన్నారులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఈవో సూచించారు. భక్తుల నుంచి ఎలాంటి అదనపు వసూళ్లకు పాల్పడకూడదని హెచ్చరించారు. విధి నిర్వహణ సమయంలో వ్యక్తిగత మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాల వినియోగాన్ని తగ్గించాలని ఆదేశించారు.
దేవస్థానంలో పనిచేయడం కేవలం ఉద్యోగ బాధ్యత మాత్రమే కాదని, అమ్మవారికి చేసే సేవగా భావించాలని శీనా నాయక్ పేర్కొన్నారు. నిజాయితీ, క్రమశిక్షణ, జవాబుదారీతనంతో పనిచేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, దేవస్థానం ప్రతిష్ఠను పెంపొందించేందుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిబంధనల ఉల్లంఘన, విధుల్లో నిర్లక్ష్యం, అవకతవకలకు పాల్పడితే కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని మరోసారి స్పష్టం చేశారు.




