
సాధారణంగా ఉద్యోగం సంపాదించాలంటే రెజ్యూమ్ తయారు చేయాలి.. కంపెనీలకు దరఖాస్తులు పంపాలి.. ఇంటర్వ్యూలకు హాజరుకావాలి. కానీ ఓ కాలేజీ విద్యార్థి మాత్రం వీటన్నింటికీ భిన్నంగా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రెజ్యూమ్ పంపకుండానే, ఇంటర్వ్యూలకు వెళ్లకుండానే రెండు భారీ ఉద్యోగ ఆఫర్లను సొంతం చేసుకున్నాడు. ఒక్కో ఉద్యోగానికి ఏడాదికి సుమారు రూ.50 లక్షల ప్యాకేజీ లభించడం విశేషం.
కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న ఈ యువకుడు అనుసరించిన ప్రత్యేకమైన వ్యూహమే అతనికి ఈ అవకాశాలను తెచ్చిపెట్టింది. ఉద్యోగాల కోసం వందలాది దరఖాస్తులు పంపడం కంటే సొంతంగా ప్రాజెక్టులు రూపొందించడం, స్టార్టప్ వ్యవస్థాపకులతో పరిచయాలు పెంచుకోవడం, తన నైపుణ్యాలను ఆచరణలో నిరూపించుకోవడంపై దృష్టి పెట్టాడు. తన అనుభవాన్ని Redditలోని r/StartUpIndia ఫోరమ్‌లో పంచుకున్నాడు.
ఏఐ వీడియో ఎడిటర్‌తో గుర్తింపు
దాదాపు రెండేళ్ల క్రితం ఈ విద్యార్థి తన స్నేహితుడితో కలిసి ఏఐ ఆధారిత వీడియో ఎడిటర్‌ను రూపొందించాడు. కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురైనా, ఈ టూల్‌కు మంచి స్పందన లభించింది. సుమారు 13 వేల మంది వినియోగదారులు దీనిని ఉపయోగించారు. అయితే ప్రాజెక్టును మరింత విస్తరించడంలో ఇబ్బందులు ఎదురుకావడంతో చివరకు దాన్ని నిలిపివేయాల్సి వచ్చింది.
వ్యాపార పరంగా ఈ ప్రాజెక్టు కొనసాగకపోయినా.. దాన్ని అభివృద్ధి చేయడం, మార్కెట్లోకి తీసుకురావడం, వినియోగదారులను సంపాదించడం వంటి అనుభవం అతనికి ఎంతో ఉపయోగపడింది. ముఖ్యంగా X (గతంలో ట్విట్టర్)లో ఈ టూల్‌ను లాంచ్ చేసిన కొద్ది రోజులకే ఓ స్టార్టప్ వ్యవస్థాపకుడి దృష్టిలో పడ్డాడు.
అదే రంగంలో ఉత్పత్తిని అభివృద్ధి చేస్తున్న ఆ ఫౌండర్.. విద్యార్థి పనితీరును గుర్తించి నేరుగా సంప్రదించాడు. ఎలాంటి సాధారణ ఇంటర్వ్యూ ప్రక్రియ లేకుండానే రిమోట్ ఉద్యోగాన్ని ఆఫర్ చేశాడు. ఈ ఉద్యోగానికి ఏడాదికి సుమారు రూ.50 లక్షల ప్యాకేజీ లభించింది. ఆ సమయంలో విద్యార్థి దగ్గర రెజ్యూమ్ కూడా సిద్ధంగా లేకపోవడం గమనార్హం.
వారం రోజుల్లోనే మరో రూ.50 లక్షల ఆఫర్
మొదటి ఉద్యోగ అవకాశం వచ్చిన తర్వాత మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. రెండో ఉద్యోగం ఆఫీసుకు వెళ్లి పనిచేసే విధానంలో ఉండటంతో, కాలేజీ చదువుకు ఇబ్బంది కలుగుతుందని విద్యార్థి భావించాడు. దీంతో తనకు అనుకూలమైన స్టార్టప్‌లను గుర్తించి నేరుగా సంప్రదించాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో కొన్ని గంటలు కేటాయించి తన నైపుణ్యాలకు సరిపోయే సుమారు 30 స్టార్టప్‌లను ఎంపిక చేసుకున్నాడు. ఆయా సంస్థల వ్యవస్థాపకులకు నేరుగా ఈమెయిల్స్ పంపించాడు. గతంలో రూపొందించిన ప్రాజెక్టులు, తన సాంకేతిక నైపుణ్యాలు, కంపెనీ అభివృద్ధికి తాను ఎలా తోడ్పడగలననే విషయాలను వివరించాడు.
అతని ప్రయత్నానికి మంచి స్పందన లభించింది. మొత్తం 13 స్టార్టప్‌ల నుంచి సమాధానాలు వచ్చాయి. చివరకు Y Combinator మద్దతు ఉన్న ఓ స్టార్టప్ నుంచి ఏడాదికి మరో రూ.50 లక్షల ప్యాకేజీతో ఉద్యోగ ఆఫర్ అందుకున్నాడు. ఈ అవకాశం కేవలం వారం రోజుల్లోనే రావడం విశేషం.
నైపుణ్యాలను నిరూపించుకోవడమే విజయ రహస్యం
ఈ విద్యార్థి అనుభవం ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తోంది. కేవలం రెజ్యూమ్‌లు, సర్టిఫికెట్లు మాత్రమే కాకుండా.. నిజ జీవితంలో ఉపయోగపడే ప్రాజెక్టులు రూపొందించడం, వాటి ద్వారా తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడం కూడా ఉద్యోగ అవకాశాలను తెచ్చిపెట్టగలదు.
సొంతంగా ఏదైనా నిర్మించి చూపించడం, సరైన కంపెనీలను గుర్తించడం, అక్కడి వ్యవస్థాపకులను నేరుగా సంప్రదించడం వంటి ప్రయత్నాలు కెరీర్లో కొత్త మార్గాలను తెరవగలవని ఈ యువకుడి ప్రయాణం స్పష్టం చేస్తోంది.
