శ్రీ సత్యసాయి బ్యూరో, ఆగస్టు 31 : శ్రీ సత్యసాయి తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు అందకపోవడంతో వారు ఆందోళనకు సిద్ధమయ్యారు. పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలని, రిటైర్డ్‌ కార్మికులకు గ్రాట్యుటీ అందించాలని డిమాండ్‌ చేస్తూ ఆగస్టు 31 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించారు.

కార్మికుల సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు తెలిపింది. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా పథకానికి నిధుల విషయంలో అనిశ్చితి కొనసాగుతోందని, దాని ప్రభావం కార్మికుల వేతనాలపై పడుతోందని అన్నారు.

వేతనాలు అందకపోయినా ప్రజలకు తాగునీటి సరఫరా నిలిచిపోకుండా కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎండ, వర్షం, రాత్రింబవళ్లు తేడా లేకుండా సేవలందిస్తున్న కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

తాగునీటి పథకానికి రాష్ట్ర బడ్జెట్‌లో ప్రత్యేకంగా తగినన్ని నిధులు కేటాయించి, వేతనాల చెల్లింపునకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఐటీయూ కోరింది. రిటైర్డ్‌, మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రావాల్సిన గ్రాట్యుటీ, ఇతర బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేసింది.

ప్రభుత్వం వెంటనే కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని, లేకపోతే డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *