
గుడివాడ అగ్నిమాపక శాఖకు రూ.75 లక్షల విలువైన నూతన అడ్వాన్స్డ్ వాటర్ టెండర్ ఫైర్ వాహనం అందుబాటులోకి వచ్చింది. సోమవారం గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఈ వాహనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులు నూతన వాహనం పనితీరు, ప్రత్యేకతలను ఎమ్మెల్యేకు వివరించారు. అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే పరికరాల పనితీరును సిబ్బంది డెమో ద్వారా ప్రదర్శించారు. అనంతరం రెస్క్యూ ఆపరేషన్లకు సంబంధించిన ఫొటో ప్రదర్శనను ఎమ్మెల్యే రాము తిలకించారు.
ప్రమాద సమయాల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలను రక్షిస్తున్న అగ్నిమాపక సిబ్బంది సేవలను ఎమ్మెల్యే అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చని అన్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో 112 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.
గుడివాడకు ఇప్పటికే అవసరమైన యంత్ర సామాగ్రి ఉన్నప్పటికీ, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మరిన్ని ఆధునిక పరికరాలు అవసరమని ఎమ్మెల్యే తెలిపారు. శాఖ నుంచి అందే ప్రతిపాదనలను పరిశీలించి, అందుబాటులో ఉన్న వనరులతో అదనపు సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇటీవల అద్దేపల్లి కాంప్లెక్స్‌లో జరిగిన ప్రమాద సమయంలో గుడివాడలో ఒకే ఫైర్ వాహనం ఉండటంతో ఎదురైన ఇబ్బందులను ఎమ్మెల్యే రాము గుర్తించి, అదనపు వాహనం కోసం కృషి చేశారని అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ జై ఆంజనేయులు తెలిపారు. ఆయన చొరవతో ప్రభుత్వం ఈ అధునాతన వాహనాన్ని మంజూరు చేసిందన్నారు.
5 వేల లీటర్ల నీటి సామర్థ్యం కలిగిన ఈ వాహనం అందుబాటులోకి రావడంతో గుడివాడతో పాటు పరిసర ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు, ఇతర అత్యవసర ఘటనల సమయంలో మరింత వేగంగా సహాయక చర్యలు చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందని తెలిపారు.
కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
