ఏలూరు జిల్లాలో చింతలపూడి ఎత్తిపోతల పథకం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. భూసేకరణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

చింతలపూడి ఎత్తిపోతల పథకం భూసేకరణ పనుల పురోగతిపై శుక్రవారం కలెక్టరేట్‌లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో జేసీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. నిర్ణీత గడువులో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ముఖ్యంగా అసైన్‌మెంట్ భూములకు సంబంధించిన అంశాలపై జేసీ అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. సంబంధిత భూసేకరణ అధికారులు, తహసీల్దార్లు నోటీసులు జారీ చేసి చట్టబద్ధమైన ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

చింతలపూడి భూసేకరణ పనుల్లో గత 40 రోజులుగా ఎలాంటి పురోగతి లేకపోవడంపై కొవ్వూరు భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌పై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరులో తక్షణమే మెరుగుదల చూపించాలని, లేకపోతే శాఖాపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

సమావేశంలో ఇప్పటికే ప్రకటించిన భూసేకరణ అవార్డుల పరిస్థితి, భూస్వాములకు పరిహారం చెల్లింపుల పురోగతి, భూసేకరణ పూర్తయిన భూములను నీటిపారుదల శాఖకు అప్పగించిన అంశాలపై జేసీ సమీక్షించారు. ప్రాజెక్టు పనులకు ఎలాంటి జాప్యం లేకుండా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

By Ramya