బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

తీర ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత సూచించారు. రానున్న మూడు రోజుల పాటు వాతావరణ పరిస్థితులను నిశితంగా గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు.

వర్షాల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వాతావరణ మార్పులు, ప్రమాద హెచ్చరికలను ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అల్పపీడనం ప్రభావంతో సముద్రంలో అలజడి, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు.

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం అందించేందుకు విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నంబర్లను అందుబాటులో ఉంచింది. అవసరమైన సమయంలో 112, 1070, 1800 425 0101 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

By Ramya