ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత డాక్టర్‌ సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌ వర్ధంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఘన నివాళులర్పించారు. దేశానికి, ప్రపంచానికి చంద్రశేఖర్‌ అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా ఆయన ప్రత్యేక పోస్టు చేశారు.

డాక్టర్‌ సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌ అసాధారణ ప్రతిభావంతుడైన శాస్త్రవేత్త అని పవన్‌ కల్యాణ్‌ కొనియాడారు. నక్షత్రాలు, విశ్వం గురించి మానవాళి అవగాహనను విస్తరించేలా ఆయన చేసిన పరిశోధనలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా ‘చంద్రశేఖర్‌ పరిమితి’ ఆవిష్కరణతో పాటు నక్షత్రాల నిర్మాణం, పరిణామంపై ఆయన చేసిన పరిశోధనలు ఖగోళ భౌతిక శాస్త్రంలో కీలకమైన మైలురాళ్లుగా నిలిచాయని తెలిపారు.

1983లో భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి అందుకున్న చంద్రశేఖర్‌ ప్రపంచంలోని గొప్ప శాస్త్రవేత్తల సరసన నిలిచారని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. జ్ఞానాన్వేషణలో ఆయన చూపిన పట్టుదల, కొత్త విషయాలను తెలుసుకోవాలనే నిరంతర తపన భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. చంద్రశేఖర్‌ సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు.

భారతీయ శాస్త్రీయ సంగీతంలో షెహనాయికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ప్రముఖ సంగీత విద్వాంసుడు ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్మరించుకున్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు.

బిస్మిల్లా ఖాన్‌ తన అద్భుతమైన సంగీతంతో షెహనాయిని ప్రపంచ వేదికపై గౌరవప్రదమైన స్థానంలో నిలిపారని పవన్‌ కల్యాణ్‌ కొనియాడారు. ఆయన షెహనాయి నుంచి వెలువడిన ప్రతి స్వరం భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వం, భక్తి భావం, సంగీత సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు.

బిస్మిల్లా ఖాన్‌ సంగీతానికి భాష, ప్రాంతం, సరిహద్దులు అడ్డుకాలేదని.. ఆయన స్వరాలు ప్రజలను ఏకం చేశాయని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తరతరాలను అలరిస్తున్న ఆయన ఆత్మీయ సంగీతం భవిష్యత్‌లోనూ ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.

భారతీయ సాంస్కృతిక వారసత్వంలో బిస్మిల్లా ఖాన్‌ సంగీతానికి ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని పవన్‌ కల్యాణ్‌ కొనియాడుతూ.. ప్రముఖ షెహనాయి విద్వాంసుడికి ఘన నివాళులర్పించారు.

By Rajini