ఏపీ రాజధాని అమరావతిలో ఎస్‌బీఐ సిబ్బంది నివాస సముదాయ నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. SBI హౌసింగ్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి SBI, APCRDA మధ్య భూ ఒప్పందం పూర్తైంది. ఐనవోలులో 2.05 ఎకరాల విస్తీర్ణంలో ఎస్‌బీఐ సిబ్బంది కోసం నివాస సముదాయాన్ని నిర్మించనున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ కోసం దాదాపు రూ.214 కోట్లను వెచ్చించనున్నారు. మొత్తం 4.46 లక్షల చదరపు అడుగుల బిల్ట్‌అప్‌ ఏరియాలో నివాస సముదాయాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది జూన్‌లో నిర్మాణ పనులు ప్రారంభించి 2028 నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

మరోవైపు లింగాయపాలెం ఉద్దండరాయునిపాలెం ప్రాంతంలో మూడు ఎకరాల్లో ఎస్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాన్ని నిర్మించనున్నారు. ఈ కార్యాలయానికి గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

అమరావతిని జాతీయ స్థాయి ఆర్థిక, పరిపాలనా కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంలో భాగంగా ఎస్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం, సిబ్బంది నివాస సముదాయ నిర్మాణాలు కీలకంగా మారనున్నాయి. రాజధానిలో బ్యాంకింగ్‌, ఆర్థిక మౌలిక వసతుల విస్తరణకు ఈ ప్రాజెక్టులు మరింత ఊతమివ్వనున్నాయి.

By Rajini