
అన్నమయ్య జిల్లా పీలేరు మండలం బోడుమల్లివారిపల్లిలో శివలింగం బయటపడింది. ఊరి శివార్లలోని మల్లేశ్వర కొండపై శివలింగం లభ్యమైంది. కొంతమంది పశువుల కాపర్లు ఈ శివలింగాన్ని కొండ మీద గుర్తించారు. ఊరిజనానికి ఈ సమాచారం చేరవేశారు. దీంతో స్థానికులు, చుట్టుపక్కల ప్రజలు పెద్ద సంఖ్యలో మల్లేశ్వర కొండపైకి చేరుకుని శివలింగానికి పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ గుడి కట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలోని బోడుమల్లివారిపల్లి గ్రామ శివార్లలో పురాతన శివలింగం బయటపడింది. గ్రామానికి ఆనుకుని ఉన్న మల్లేశ్వర కొండపై శివలింగం లభ్యమైంది. రెండు రోజుల కిందట పశువుల కాపరులు ఈ శివలింగాన్ని గుర్తించారు. శ్రీవేంకటేశ్వర ఆలయం వెనుక భాగంలో ఉన్న మల్లేశ్వర కొండపైకి పశువులను మేత కోసం తోలుకెళ్లిన సమయంలో.. పశువుల కాపరులకు శివలింగం కనిపించింది. ఈ విషయాన్ని వారు గ్రామంలోని ప్రజలకు తెలియజేశారు. అనంతరం ఊరి ప్రజలు శివలింగం లభ్యమైన ప్రాంతాన్ని శుభ్రపరిచి.. పాలతో శివుడికి అభిషేకం నిర్వహించారు. పూజారి సాయంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శివలింగం లభ్యమైన ప్రాంతంలో చిన్న గుడిసె వంటిది ఏర్పాటు చేశారు. మరోవైపు మల్లేశ్వర కొండపై శివలింగం బయటపడిందనే సంగతి తెలిసీ ఊరిజనంతో పాటు, చుట్టుపక్కల గ్రామాల వారు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. శివలింగానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఇది స్వయంభువుగా వెలిసిన శివలింగంగా భావిస్తున్నామంటున్నారు బోడిమల్లివారిపల్లి ఊరిజనం. ఆ మహాశివుడే తమను అనుగ్రహించేందుకు ఇక్కడ అవతరించారని.. మల్లేశ్వర కొండ శివలింగం లభ్యం కావటంతో మల్లేశ్వర క్షేత్రంగా మారుతుందని చెప్తున్నారు. ప్రభుత్వం ఇక్కడ ఆలయం నిర్మించి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.
మరోవైపు ఈ ప్రాంతాన్ని గతంలో విజయనగర రాజులు, పల్లవులు పాలించారు. ఈ నేపథ్యంలో నాటి శిల్పకళా అవశేషాలు అప్పుడప్పుడూ కనిపించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మల్లేశ్వర కొండపై తాజాగా శివలింగం బయటపడటంతో ప్రస్తుతం ఇలాంటి అభిప్రాయాలే మరోసారి వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ఎవరైనా అక్కడ ఈ శివలింగాన్ని ఉంచారా అనే దానిపై స్పష్టత లేదు. అయితే మల్లేశ్వర కొండపై శివలింగం ప్రత్యక్షమైందనే ప్రచారంతో భక్తులు పెద్దసంఖ్యలో ఇక్కడకు చేరుకుంటున్నారు. శివలింగానికి పూజలు నిర్వహిస్తున్నారు.

