
రాప్తాడు జెడ్పీ హైస్కూలులో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి బెంగళూరులో చికిత్స పొందుతున్న చిన్నారికి ప్లాస్టిక్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని త్వరలోనే పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయూ) నుంచి జనరల్ వార్డుకు తరలించనున్నట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై సోమవారం ఆయన ఎక్స్ వేదికగా తాజా వివరాలను వెల్లడించారు.
వైద్యుల బృందం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ప్లాస్టిక్ సర్జరీ నిపుణులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గాయాలను శుభ్రపరిచే వూండ్ డీబ్రైడ్‌మెంట్ ప్రక్రియతో పాటు కుట్ల సర్దుబాటును విజయవంతంగా పూర్తి చేశారు. చిన్నారి గాయాలు వేగంగా మానుతున్నాయని చికిత్స సమయంలో ఆమె ఎంతో ధైర్యంగా వ్యవహరించిందని వైద్యులు తెలిపారు.
చిన్నారి కోలుకునే క్రమంలో మరో సానుకూల పరిణామం చోటుచేసుకుంది. ఆమె ఎడమ చేతికి వేసిన స్లింగ్‌ను వైద్యులు తొలగించారు. దీంతో త్వరలోనే ఆ చేతిని తిరిగి కదిలించే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం నొప్పి నివారణ మందులతో పాటు అవసరమైన ప్రత్యేక ఆహార సహాయాన్ని అందిస్తున్నారు.
చిన్నారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వైద్య బృందం స్పష్టం చేసింది. త్వరలోనే పీఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. బాధిత చిన్నారి త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు ఆకాంక్షిస్తున్నారు.
