టాలీవుడ్‌లో కొత్త కథలు, విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హీరో అనీష్‌ నటుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’పై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా ‘రంగస్థలం’ కంటే పెద్ద విజయం సాధించాలని మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఆకాంక్షించారు.

మహేశ్‌ ఉప్పల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల నిర్మించారు. అనస్వర రాజన్‌ కథానాయికగా నటించగా, అక్కినేని నాగార్జున ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఈ నెల 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించిన మ్యూజికల్‌ కాన్సర్ట్‌కు రామ్‌చరణ్‌, అఖిల్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో నాగార్జున ఎప్పుడూ ముందుంటారని ప్రశంసించారు. ఆయన ఈ సినిమాను సమర్పిస్తున్నారంటేనే చిత్రంపై నమ్మకం పెరుగుతుందని అన్నారు. ఏడాది క్రితమే అనీష్‌ తనకు ఈ సినిమా గురించి చెప్పాడని, కొన్ని సన్నివేశాలు కూడా చూపించాడని గుర్తుచేసుకున్నారు.

తన తొలి సినిమా సమయంలో ఎలా నటించానో కూడా గుర్తులేదని, కానీ అనీష్‌ మాత్రం తొలి ప్రయత్నంలోనే తనకంటే పది రెట్లు అద్భుతంగా నటించాడని అనిపించిందన్నారు. సినిమాలో మాటలు రాని వ్యక్తిగా నటిస్తూ తొమ్మిది రసాలను అద్భుతంగా పలికించాడని కొనియాడారు. సినిమాపై, నటనపై అతడికున్న ఆసక్తి, అంకితభావమే ఈ ప్రతిభకు కారణమని పేర్కొన్నారు. ఈ చిత్రం అనీష్‌ కెరీర్‌లో మైలురాయిగా నిలవాలని, అతడు పరిశ్రమలో సుదీర్ఘకాలం కొనసాగాలని ఆకాంక్షించారు.

అఖిల్‌ మాట్లాడుతూ.. అనీష్‌ తొలిసారి కథ చెప్పినప్పుడు మాటలు లేకుండా సినిమా ఎలా తెరకెక్కిస్తారోనని ఆశ్చర్యపోయానన్నారు. అయితే సినిమా చూసిన తర్వాత దర్శకుడు మహేశ్‌ ఉప్పల కథను అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. ఇది కొత్త తరహా కమర్షియల్‌ చిత్రమని, విభిన్నమైన కథాంశంతో రూపొందించారని తెలిపారు. అనీష్‌, అనస్వర రాజన్‌ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, తమన్‌ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు.

చిత్ర సమర్పకుడు నాగార్జున మాట్లాడుతూ.. రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’లో చెవిటి వ్యక్తి పాత్ర చేయడానికి పదేళ్ల సమయం పట్టిందని, కానీ అనీష్‌ తన తొలి చిత్రంలోనే మూగవాడి పాత్రలో అద్భుతంగా నటించాడని ప్రశంసించారు.

ఈ వేడుకలో హీరో అనీష్‌, సంగీత దర్శకుడు తమన్‌, దిల్‌రాజు, వై.రవిశంకర్‌, దర్శకుడు మహేశ్‌ ఉప్పల, అనస్వర రాజన్‌, వెంకీ కుడుముల, మానస శర్మ, కల్యాణ్‌ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *