
D Educt: Nov 5: నీట్, జేఈఈ సహా జాతీయ పరీక్షల నిర్వహణకు జిల్లా స్థాయి కమిటీలు పునర్వ్యవస్థీకరణ
నీట్, జేఈఈ మెయిన్, సీయూఈటీ, యూజీసీ నెట్‌తో పాటు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) నిర్వహించే ఇతర పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లా స్థాయి సమన్వయ కమిటీలను పునర్వ్యవస్థీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర, జిల్లా స్థాయి సమన్వయ కమిటీల్లోని పలువురు అధికారులు బదిలీ కావడం, మరికొందరు పదవీ విరమణ చేయడంతో కొత్తగా కమిటీలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా, అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతలను ఈ కమిటీలకు అప్పగించారు.
జిల్లా స్థాయి సమన్వయ కమిటీకి జిల్లా కలెక్టర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. గతంలో నిర్వహించిన పరీక్షల్లో పరీక్షా కేంద్రాల పనితీరు, కేంద్రాల యజమానుల నేపథ్యాన్ని కమిటీ పరిశీలిస్తుంది. పరీక్షా కేంద్రాల ఎంపికలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే విద్యాసంస్థల్లోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
అలాగే జిల్లా కలెక్టర్, ఎస్పీ సంయుక్తంగా పరీక్షా కేంద్రాలను తనిఖీ చేస్తారు. ప్రశ్నపత్రాలను భద్రపరిచిన ప్రదేశం నుంచి పరీక్షా కేంద్రాలకు తరలించడం, పరీక్ష పూర్తయిన తర్వాత ఓఎమ్మార్ షీట్లు, సమాధాన పత్రాలను సురక్షితంగా తిరిగి తరలించేందుకు కమిటీ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుంది.
పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా పోలీసు, పారామిలటరీ బలగాలతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ సమన్వయ కమిటీలు నిరంతరం పర్యవేక్షణ చేపట్టనున్నాయి.
