
ప్రసవం ముగింపు కాదు. అది కోలుకునే ప్రక్రియకు ఆరంభం మాత్రమే. భారతదేశంలో ప్రసవానంతర సంరక్షణ నిజానికి అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్న అంశం అని వైద్యులు అంటున్నారు. డెలివరీ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే అసలైన పరీక్ష మొదలవుతుంది. తల్లిపాలు పట్టడంలో సరైన మార్గదర్శకత్వం లేకపోవడం, 15 నుంచి 20% మంది తల్లులలో కనిపించే మానసిక ఆందోళన, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లేకపోవడం లాంటివి తల్లుల ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి.
డెలివరీ తర్వాత తల్లి ఆరోగ్యం కేవలం క్లినికల్ ప్రోటోకాల్స్‌పైన ఆధారపడదు. తనకు లభించే సామాజిక, మానసిక మద్దతుపై తల్లి ఆరోగ్యం ఆధార పడుతుంది. టైమ్స్ ఇంటర్నెట్, ప్రెగాటిప్స్ నిర్వహించిన “టైమ్స్ ఫ్యూచర్ ఆఫ్ మ్యాటర్నిటీ 2026” కార్యక్రమంలో, వైద్యులు మరియు నిపుణులు భారతదేశంలో ప్రసూతి సంరక్షణ వ్యవస్థలో ఎక్కువగా ప్రాధాన్యం పొందని అంశాలపై చర్చించారు.
తల్లిపాలు పట్టడం పై గ్లోబల్ గైడ్‌లైన్స్ స్పష్టంగా ఉన్నా, భారత్లో ఇంకా గ్యాప్స్ కనిపిస్తున్నాయి. ఈ విషయంపై ఎవర్ బ్లిస్ మేటర్నిటీ వ్యవస్థాపకులు డాక్టర్ దీప్తి అరోరా మాట్లాడారు. తల్లికి తెలియక బ్రెస్ట్ ఫీడింగ్ విఫలం అవ్వట్లేదని, సరైన సమయంలో గైడెన్స్ అందకపోవడం వలన విఫలం అవుతోందని వారు తెలిపారు.
సరైన పద్ధతిలో బిడ్డను పట్టుకోకపోవడం వలన రొమ్ముల్లో నొప్పి రావడం, పాలు తక్కువగా ఉన్నాయని ఆందోళన పడడం, ప్రసవం తర్వాత ఆలస్యంగా పాలు పట్టడం లాంటివి ప్రధాన సమస్యలని వారు తెలిపారు. ప్రసవం తర్వాత కాదు, గర్భధారణ సమయంలోనే తల్లికి పాలు పట్టడం పై శిక్షణ ఇవ్వాలని, అదే సమస్యకు పరిష్కారమని చెప్పారు.

