D Spiritual; Nov 17: కార్తీకమాసం సందర్భంగా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని డిప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామ వరప్రసాదరావు అధికారులను ఆదేశించారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు దర్శన ఏర్పాట్లలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

కార్తీకమాసం, మంగళవారం కావడంతో తెల్లవారుజాము నుంచే మోపిదేవి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆలయ పరిసర ప్రాంతాల్లో పర్యటించి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా దేవస్థాన సిబ్బందికి పలు సూచనలు చేశారు.

భక్తులకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని, ఆలయానికి వచ్చే వారితో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఆలయంలో రద్దీ అధికంగా ఉన్నందున భక్తులు పోలీసుల, దేవస్థాన సిబ్బంది సూచనలు పాటిస్తూ సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. శ్రీ స్వామివారు, శ్రీ అమ్మవారిని ప్రశాంతంగా దర్శించుకుని పూజలు నిర్వహించుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *