
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుపై మాజీ ఎంపీ కేశినేని నాని మరోసారి స్పందించారు. ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ మెట్రో ప్రాజెక్టు విజయవాడకు వరమా? శాపమా? అనే చర్చను తెరపైకి తీసుకొచ్చారు.
విజయవాడలో ప్రధానంగా బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు వంటి రెండు కీలక కమర్షియల్ రోడ్లు మాత్రమే ఉన్నాయని పేర్కొన్న నాని.. ఈ నగరానికి మెట్రో రైలు అవసరమా? అనే ప్రశ్నను లేవనెత్తారు.
మెట్రో రైలు ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.12 వేల కోట్లు అని ప్రభుత్వం చెబుతోందని, నిర్మాణం పూర్తయ్యేందుకు 10 నుంచి 15 ఏళ్లు పట్టే అవకాశం ఉందని నాని పేర్కొన్నారు. అప్పటికి ప్రాజెక్టు వ్యయం రెట్టింపై రూ.24 వేల కోట్లకు చేరే అవకాశం ఉందని అన్నారు.
మెట్రో కోసం ఖర్చు చేసే మొత్తంలో 25 శాతం నిధులను విజయవాడలో మౌలిక వసతుల అభివృద్ధికి వెచ్చిస్తే నగరాన్ని మరింత నివాసయోగ్యంగా తీర్చిదిద్దవచ్చని నాని సూచించారు.
24/7 సురక్షిత తాగునీరు, గుంతలు లేని రహదారులు, భూగర్భ డ్రైనేజీ, వరద నివారణ, నిరంతర విద్యుత్, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, చెత్త నిర్వహణ, సురక్షిత ఫుట్‌పాత్‌లు, మెరుగైన ప్రజా రవాణా వంటి సదుపాయాల అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.
అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు, అత్యవసర వైద్య సేవలు, ప్రభుత్వ పాఠశాలలు, ఉద్యానవనాలు, ఆటస్థలాలు, పార్కింగ్, ప్రజా మరుగుదొడ్లు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు అనుకూలమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా భద్రత, అగ్నిమాపక సేవలు, పచ్చదనం, కాలుష్య నియంత్రణపై కూడా దృష్టి పెట్టాలని అన్నారు.
మెట్రో ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో 25 శాతం నిధులతో విజయవాడకు అవసరమైన ఈ మౌలిక సదుపాయాలను కల్పించి నగరాన్ని మరింత అందంగా, నివాసయోగ్యంగా మార్చడం మంచిదా? లేక మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టడం మంచిదా? అని కేశినేని నాని ప్రశ్నించారు.
వరుసగా రెండు రోజుల పాటు మెట్రో ప్రాజెక్టుపై నాని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాగా, ఏపీ ప్రభుత్వం విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ మెట్రో రైలు ప్రాజెక్టులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటోంది.

