
సామాజిక మాధ్యమాల్లో ఆవిర్భవించి, విద్యార్థుల దేశవ్యాప్త ఉద్యమానికి నాయకత్వం వహించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కేంద్ర విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించే స్థాయికి చేరుకుంది. అయితే, ఈ పరిణామం చోటుచేసుకున్న వెంటనే పార్టీలో చీలిక ఏర్పడటం గమనార్హం.
ఉద్యమకారుల్లో ఒకరైన బ్రహ్మ భట్ తాను సీజేపీ నుంచి బయటకు వచ్చినట్లు ప్రకటించారు. పార్టీ జాతీయ కార్యవర్గం మొత్తం ఆప్ నేతలతో నిండిపోయిందని, సీజేపీ క్రమంగా ‘పేపర్ మాఫియా’గా మారుతోందని ఆయన ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ కనుసన్నల్లో పార్టీ కార్యకలాపాలు సాగుతున్నాయని విమర్శించిన బ్రహ్మ భట్, సీజేపీ నుంచి విడిపోయి ‘సీజేపీ ప్రజాతంత్ర’ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పుట్టుకొచ్చి, నీట్ యూజీ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమాన్ని నడిపి సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి ఊహించని షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా పలు సమస్యలపై ఆందోళనలు చేపడుతున్న ఈ పార్టీలో తాజాగా చీలిక ఏర్పడింది. ఉద్యమకారుల్లో ఒకరైన మనీశ్ బ్రహ్మభట్ సీజేపీ నుంచి వైదొలిగి, ‘కాక్రోచ్ జనతా పార్టీ-డెమొక్రటిక్’ పేరుతో కొత్త రాజకీయ వేదికను గురువారం ప్రకటించారు.
ఈ సందర్భంగా బ్రహ్మభట్ సీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. అభిజీత్ దీప్కే నేతృత్వంలో ఉద్యమ లక్ష్యాలతో ఆవిర్భవించిన పార్టీ.. ప్రస్తుతం తన అసలు ఉద్దేశం నుంచి దూరమవుతోందని ఆరోపించారు. సీజేపీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎంపిక చేసిన బృందంలా మారిపోయిందని విమర్శించారు. ఒకే పార్టీని వ్యతిరేకించడం, ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ శక్తులకు మద్దతు ఇవ్వడమే సీజేపీ ప్రధాన కార్యకలాపంగా మారిపోయిందని ఆయన ఆరోపించారు.
ఇదే అంశంపై గతంలోనూ సీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీ కూర్పును బ్రహ్మభట్ ప్రశ్నించారు. జాతీయ కార్యవర్గం కేజ్రీవాల్ నామినేట్ చేసిన బృందంలా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వాలంటీర్లు, నిరసనకారులకు పార్టీలో తగిన ప్రాతినిధ్యం కల్పించడం లేదని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో ‘కాక్రోచ్ జనతా పార్టీ-డెమొక్రటిక్’ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన బ్రహ్మభట్.. ఉద్యమంలో భాగస్వాములైన ప్రజల ‘సామూహిక శక్తి’ని ఏకం చేయడమే కొత్త వేదిక ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలకు మరింత ప్రాతినిధ్యం కల్పించే దిశగా కొత్త పార్టీ పనిచేస్తుందని తెలిపారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి వచ్చిన CJP అనంతరం పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలోని అవకతవకలకు వ్యతిరేకంగా ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన నిరసనలకు నాయకత్వం వహించింది. ఆ తర్వాత తమ కార్యకలాపాలను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు సంస్థ ప్రకటించింది. అయితే, CJP ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించబోదని, ప్రజల సమస్యలపై ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చే ‘పబ్లిక్ ప్రెజర్ గ్రూప్’గా మాత్రమే కొనసాగుతుందని సంస్థ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, ఇటీవల ఏర్పాటు చేసిన కార్యవర్గంపై బ్రహ్మ్‌భట్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త కమిటీ CJP విస్తృత ఉద్యమ స్వరూపాన్ని ప్రతిబింబించడం లేదని ఆయన ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు నేతలకు కమిటీలో చోటు కల్పించగా, నిరసనల్లో పాల్గొన్న ఇతర రాజకీయ పార్టీలకు చెందిన వాలంటీర్లను మాత్రం విస్మరించారని విమర్శించారు. ‘ఈ కమిటీలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవారే ఎనిమిది మంది ఎందుకు ఉన్నారు?’ అని భట్ ప్రశ్నించారు.
