ఈ ఏడాది జనవరిలో తన స్వగ్రామం బారామతికి విమానంలో వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందిన విషయం తెలిసిందే. బారామతి ఎయిర్‌పోర్ట్ రన్‌వేకు సమీపంలో ల్యాండింగ్ అవుతుండగా విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

అయితే, ఈ విమాన ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరపాలని అజిత్ పవార్ కుటుంబసభ్యులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సోదరి, ఎంపీ సుప్రియా సూలే చేసిన వ్యాఖ్యలు తాజాగా చర్చనీయాంశంగా మారాయి. ఆమె వ్యాఖ్యలకు అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ కౌంటర్ ఇచ్చారు.

అజిత్ పవార్ మరణాన్ని రాజకీయం చేయొద్దు: సునేత్రా పవార్

మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం, తన భర్త అజిత్ పవార్ మరణాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవద్దని ఆయన భార్య, డిప్యూటీ సీఎం సునేత్రా పవార్ విజ్ఞప్తి చేశారు. అజిత్ పవార్ మృతితో మహారాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిన విషాదం, శూన్యతను తనతో పాటు ఆయన పిల్లలు అత్యంత తీవ్రంగా అనుభవిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

‘‘అజిత్ దాదా మరణంతో మహారాష్ట్రలో ఏర్పడిన శూన్యత ఎలాంటిదో ఆయన పిల్లలు, నా కంటే బాగా ఎవరు అర్థం చేసుకోగలరు? ఇది మా కుటుంబానికి ఎంతో బాధాకరమైన సమయం. అందువల్ల ఈ విషాదకర ఘటనను దయచేసి రాజకీయం చేయవద్దు’’ అని సునేత్రా పవార్ కోరారు.

అజిత్ పవార్ మరణం అనంతరం ఎన్సీపీ పగ్గాలను సునేత్రా పవార్ చేపట్టడంతో పాటు, ప్రభుత్వంలో ఆయన నిర్వహించిన బాధ్యతలను కూడా స్వీకరించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా, శరద్ పవార్ కుమార్తె, అజిత్ పవార్ సోదరి సుప్రియా సూలే ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. అజిత్ పవార్ మరణం తర్వాత ఆయన వర్గం శోకంలో ఉండాల్సింది పోయి ‘అధికారాన్ని అనుభవిస్తోందని’ సుప్రియా సూలే విమర్శించారు. అంతేకాకుండా, అజిత్ పవార్ మరణంపై ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ఆమె ప్రశ్నించారు.

ఈ వ్యాఖ్యలకు స్పందించిన సునేత్రా పవార్.. అజిత్ పవార్ మరణం వంటి విషాదకర ఘటనను రాజకీయ వివాదంగా మార్చవద్దని కోరారు.

జనవరి 28న బారామతి విమానాశ్రయం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆయన భార్య సునేత్రా పవార్ తాజాగా స్పందించారు.

ఈ విషాద ఘటనకు సంబంధించి ప్రతి ఒక్కరూ స్పష్టమైన నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారని, ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆమె తెలిపారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శాసనసభలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని సునేత్రా పవార్ పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థలు తమ విధులను నిర్వర్తిస్తున్నాయని, వాటిపై, చట్టంపై, రాజ్యాంగంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.

అందువల్ల విమాన ప్రమాదంపై విచారణ జరుపుతున్న అధికారులకు తగినంత సమయం ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, అందరూ ఓపికగా ఎదురుచూడాలని ఆమె కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *