2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభమైన తర్వాత, అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు మాస్కోపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించాయి. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తే, యుద్ధాన్ని ముగించే దిశగా ఆ దేశం వెనక్కి తగ్గుతుందని అవి భావించాయి. అయితే, పశ్చిమ దేశాల అంచనాలు తారుమారయ్యాయి. ఆంక్షలను తట్టుకుంటూ రష్యా తన ఆర్థిక వ్యవస్థను కొనసాగించడంతో పాటు, యుద్ధాన్ని కూడా కొనసాగిస్తోంది.

ఈ నేపథ్యంలో రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై భారీ సుంకాలు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కల్పించే బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది. అయితే, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసినంత మాత్రాన ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు.

రష్యా చమురు కొనుగోళ్లపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు

ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు చేసుకోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కీవ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించినంత మాత్రాన ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం ఆగిపోదని స్పష్టం చేశారు.

మాస్కో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచడం ద్వారా యుద్ధాన్ని నిలిపివేయవచ్చన్న పాశ్చాత్య దేశాల అభిప్రాయాన్ని జైశంకర్ తోసిపుచ్చారు. ఐదో ఏడాదిలోకి ప్రవేశించిన ఈ సంఘర్షణకు శాశ్వత పరిష్కారం కేవలం చర్చలు, దౌత్యం, పరస్పర సంప్రదింపుల ద్వారానే సాధ్యమవుతుందని ఆయన పునరుద్ఘాటించారు.

ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహాతో సమావేశమైన అనంతరం జైశంకర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చమురు, ఖనిజాలు, లోహాలు లేదా ఎరువుల వంటి వస్తువులను ఏ దేశం కొనడం లేదా కొనకపోవడం వల్ల ఈ యుద్ధానికి పరిష్కారం లభించదని పేర్కొన్నారు.

సంఘర్షణకు ముగింపు పలకాలంటే సంబంధిత పక్షాల మధ్య నిరంతర సంభాషణ, దౌత్యపరమైన ప్రయత్నాలు, చర్చలు జరగాల్సిన అవసరం ఉందని జైశంకర్ స్పష్టం చేశారు.

140 కోట్లకు పైగా జనాభా కలిగిన భారత్‌ ఎదుర్కొంటున్న ఇంధన భద్రతా సవాళ్లను కేంద్ర మంత్రి వివరించారు. ప్రస్తుత ప్రపంచ ఇంధన పరిస్థితులు అత్యంత సంక్లిష్టంగా ఉన్న నేపథ్యంలో, భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఇతర దేశాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌ అభిప్రాయాలను భారత్‌ గౌరవిస్తున్నట్లే, భారతదేశం అనుసరిస్తున్న దృక్పథాన్ని కూడా ఇతర దేశాలు గౌరవించాలని ఆయన అన్నారు. ఇంధన భద్రత విషయంలో ఉక్రెయిన్‌, భారత్‌ రెండింటి ప్రయోజనాలు, పరిస్థితులను సమతుల్యంగా అర్థం చేసుకోవడం ముఖ్యమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *