
భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధుల మధ్య సుదీర్ఘంగా చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల ద్వారా వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసిన నేపథ్యంలో, భారత్‌పైనా భారీగా టారిఫ్‌లు విధించారు. అయితే, అమెరికా బెదిరింపులకు తలొగ్గే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రకటన వెలువడినప్పటికీ, ఇప్పటివరకు అది అమల్లోకి రాలేదు. ఒప్పందం ఖరారుపై ఇరు దేశాల మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒప్పందానికి సంబంధించి భారత్ తన ప్రయోజనాలను కాపాడుకుంటూనే ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
అమెరికాతో ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)పై తుది నిర్ణయం తీసుకునే ముందు, ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌కు సుంకాల విషయంలో ప్రాధాన్య రేటు కల్పించేందుకు అమెరికా అంగీకరించాల్సి ఉంటుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
గురువారం నిర్వహించిన ‘లేవరేజింగ్ ఎఫ్‌టీఏల ఆట్రీచ్’ జాతీయ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ.. న్యూజిలాండ్‌తో కుదిరిన వాణిజ్య ఒప్పందం త్వరలో అమల్లోకి వస్తుందని చెప్పారు. అనంతరం 27 దేశాల కూటమి అయిన యూరోపియన్ యూనియన్‌తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కూడా అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.
“పోటీ దేశాలతో పోలిస్తే అమెరికా భారత్‌కు ప్రాధాన్య సుంకాలను అందించేందుకు సిద్ధమైన వెంటనే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసి, తుది వివరాలను వెల్లడిస్తాం” అని గోయల్ పేర్కొన్నట్లు ఏఎన్ఐ నివేదించింది.
అంతేకాకుండా, రాబోయే కొన్ని నెలల్లో కెనడా, మెక్సికో, చిలీ, మెర్కోసూర్, దక్షిణాఫ్రికా కస్టమ్స్ యూనియన్ (SACU), గల్ఫ్ సహకార మండలి (GCC), ఇజ్రాయెల్ తదితర దేశాలు, కూటములతో వాణిజ్య ఒప్పందాల దిశగా భారత్ ముందుకు సాగనుందని మంత్రి తెలిపారు. అలాగే ఆసియా, దక్షిణ కొరియా, జపాన్‌తో ఇప్పటికే ఉన్న వాణిజ్య ఒప్పందాలను కూడా సమీక్షించనున్నట్లు చెప్పారు.
ఈ వాణిజ్య ఒప్పందాల ద్వారా ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 75 శాతం వాటాను భారత్ ఇతర పోటీ దేశాల కంటే తక్కువ సుంకాలతో పొందే అవకాశం ఉంటుందని గోయల్ వెల్లడించారు.
ఇప్పటికే యునైటెడ్ కింగ్డమ్, మారిషస్, ఒమన్, యూఏఈ, ఆస్ట్రేలియాలతో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు కూడా దశలవారీగా అమల్లోకి రానున్నాయని ఆయన తెలిపారు.
భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)పై ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. మార్కెట్లను మరింత విస్తరించడం, వాణిజ్య అడ్డంకులను తగ్గించడం, పరస్పర ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.
ఒప్పందానికి సంబంధించిన ముసాయిదా ఇప్పటికే సిద్ధమైందని, మరో మూడు నుంచి నాలుగు నెలల్లో దీనిపై సంతకాలు జరిగే అవకాశం ఉందని జూలైలో ఓ సీనియర్ అమెరికా అధికారి వెల్లడించారు. అయితే, ప్రస్తుతం అమెరికా చేపట్టిన ‘సెక్షన్ 301’ వాణిజ్య విచారణలే ఒప్పందం ముందుకు సాగేందుకు ప్రధాన అవరోధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
