
D Spiritual: Nov 23: సింహాచలంలో ఘనంగా శ్రీ నృసింహ మాలధారణ కార్యక్రమం
సింహాచలం: విశాఖపట్నం జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో సోమవారం శ్రీ నృసింహ మాలధారణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నృసింహ స్వామి మాలధారణ చేసి దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యుల నేతృత్వంలో దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు, అర్చకులు మాలధారణకు అవసరమైన పూజా సామగ్రితో ఊరేగింపు నిర్వహించారు.
అనంతరం ఆలయ ఉత్తర గోపురం ఎదురుగా ఉన్న వార్షిక కల్యాణోత్సవ మండపంలో అప్పన్న స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.




