D Spiritual: Nov 5: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటల సమయం

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గురువారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలలో రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 8 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

భక్తుల రద్దీ కారణంగా స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కల్పించేందుకు సుమారు 6 నుంచి 8 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం.

మరోవైపు, బుధవారం తిరుమల శ్రీవారిని మొత్తం 68,004 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,964 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఇక బుధవారం శ్రీవారి హుండీ ద్వారా రూ.3.91 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.