పార్టీ గుర్తుపై గెలిచిన ప్రజాప్రతినిధులు.. ఆ పార్టీ ఆదేశాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించి ఫిరాయింపులకు పాల్పడితే వారిపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్ సాధారణంగా ఉంటుంది. అయితే, పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని స్పీకర్‌ను కోరడం, దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం వేగంగా జరిగిపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మమతా బెనర్జీ వర్గం అప్రమత్తమైంది. తిరుగుబాటు చేసిన 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన టీఎంసీ.. వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరింది.

తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు విధించిన మూడు నెలల గడువు గురించి పశ్చిమ బెంగాల్ శాసనసభ స్పీకర్‌కు పూర్తి అవగాహన ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

TMC సీనియర్ ఎమ్మెల్యే శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపిస్తూ రెబల్ వర్గానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఛటోపాధ్యాయ జూలై 7న శాసనసభ స్పీకర్ రథిన్ బోస్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం మాట్లాడుతూ, గతంలో కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పీకర్‌కు పూర్తి అవగాహన ఉందని, నిర్దేశించిన గడువులోగా తగిన నిర్ణయం తీసుకునేందుకు ఆయన చర్యలు చేపడతారని భావిస్తున్నట్లు పేర్కొంది.

2020 జనవరిలో మణిపూర్ ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి మూడు నెలల గడువును సుప్రీంకోర్టు నిర్దేశించింది. అదే తీర్పును ప్రస్తుత కేసులో ధర్మాసనం ప్రస్తావించింది.

ఈ కేసులో మూడు నెలల గడువు అక్టోబర్ 10తో ముగుస్తుందని పేర్కొన్న ధర్మాసనం, పిటిషన్‌పై తదుపరి విచారణ అవసరం లేదంటూ కేసును ముగించింది.

దీదీ వర్గం దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని 10 మంది రెబెల్ ఎమ్మెల్యేలను కోరుతూ అసెంబ్లీ సచివాలయం నోటీసులు జారీ చేసిన కొద్ది రోజులకే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రితబ్రత బెనర్జీ సహా 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ త్వరగా పరిష్కరించేలా ఆదేశాలు ఇవ్వాలని చటోపాధ్యాయ తన పిటిషన్‌లో కోరారు.

రితబ్రత బెనర్జీతో పాటు అరూప్ రాయ్, ఫర్హాద్ హకీమ్, సందీపన్, అఖ్రూజ్జమాన్ అన్సారీ, షియులీ, సబీనా యాస్మిన్, విప్లవ్ మిత్రా, జావేద్ ఖాన్, రథిన్ ఘోష్‌లకు అసెంబ్లీ సచివాలయం నోటీసులు జారీ చేసింది.

ఇదిలా ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో 15 ఏళ్లుగా కొనసాగిన టీఎంసీ పాలన ముగిసింది. ఎన్నికల అనంతరం టీఎంసీలో విభేదాలు తీవ్రతరం కావడంతో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయినట్లు సమాచారం.