
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ఈ-చలానాలు చెల్లించకుండా తప్పించుకుంటున్న వాహనదారులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పెండింగ్లో ఉన్న సుమారు రూ.20 వేల కోట్ల చలానాలను వసూలు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించినట్లు తెలుస్తోంది.
బకాయి చలానాలను నెలవారీ విద్యుత్ బిల్లులో చేర్చి వసూలు చేసే విధానాన్ని పరిశీలించాలని, చలానాలు చెల్లించని వాహనాలకు ఆర్సీ రెన్యూవల్, ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ వంటి సేవలను నిలిపివేయాలని ఆదేశించినట్లు సమాచారం. పదేపదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సూచించినట్లు తెలుస్తోంది.
ఈ ఆదేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటి? పెండింగ్ ఈ-చలానాలపై ఇకపై ఎలాంటి చర్యలు ఉండనున్నాయి? పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంతో పాటు ప్రయాణికులు, వాహనదారుల భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు సుప్రీంకోర్టు కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై విధించే ఈ-చలాన్ల వసూళ్లలో సంస్కరణలు తీసుకురావాలని స్పష్టం చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి 2012లో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన జస్టిస్ కె.వి. విశ్వనాథన్, జస్టిస్ పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం.. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు ఈ-చలాన్ల వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, జరిమానాల వసూళ్లలో నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని సూచించింది.
ఈ-మానిటరింగ్ వ్యవస్థ అమల్లోకి వచ్చినప్పటి నుంచి వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి సుమారు రూ.45,000 కోట్ల విలువైన చలానాలు జారీ అయ్యాయి. అయితే, ఇందులో ఇప్పటివరకు కేవలం రూ.25,000 కోట్లు మాత్రమే వసూలైనట్లు అమికస్ క్యూరీ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మరో రూ.20,000 కోట్ల మేర చలానా బకాయిలు పెండింగ్లో ఉండటంపై న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ బకాయిలను సమర్థవంతంగా వసూలు చేసేందుకు ధర్మాసనం ఒక వినూత్న ప్రతిపాదనను సూచించింది. వాహనదారులు చెల్లించాల్సిన ట్రాఫిక్ చలానా మొత్తాలను వారి నెలవారీ విద్యుత్ బిల్లుల్లోనే జత చేసి పంపే విధానాన్ని పరిశీలించాలని సూచించింది. విద్యుత్ బిల్లు చెల్లించకపోతే సరఫరా నిలిపివేసే అవకాశం ఉండటంతో, ఈ విధానం ద్వారా చలానాల వసూళ్లు వేగవంతం కావచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది.
