గుడివాడ: కష్టకాలంలో టీడీపీ కార్యకర్తలు, వారి కుటుంబాలకు పార్టీ అండగా నిలుస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన ముగ్గురు టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ సభ్యత్వ బీమా కింద మంజూరైన రూ.15 లక్షల చెక్కులను శుక్రవారం గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో అందజేశారు.

గుడ్లవల్లేరుకు చెందిన గుమ్మడి శ్రావణి, అంగులూరుకు చెందిన చింతా విజయలక్ష్మి, వడ్లమన్నాడుకు చెందిన కొనతం శ్రీరామమూర్తి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున బీమా సాయం అందించారు. కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాము బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేశారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబాల సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌, ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన సమయంలో పార్టీ సభ్యత్వ బీమా ద్వారా అందిన ఆర్థిక సాయం తమకు ఎంతో భరోసా కల్పించిందన్నారు.

ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ.. టీడీపీకి కార్యకర్తలే వెన్నెముక అని అన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు, వారి కుటుంబాలకు కష్టసమయంలో అండగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌ లక్ష్యమన్నారు. కార్యకర్తల సంక్షేమానికి పార్టీ అధిష్ఠానం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు అవసరమైన సమయంలో అండగా ఉంటామని రాము హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా తనవంతు సహకారం అందిస్తామని చెప్పారు. కార్యకర్తల కుటుంబాలను తమ కుటుంబాలుగా భావించి ఆదుకుంటామని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో గుడ్లవల్లేరు మండల పార్టీ అధ్యక్షుడు పోలవరపు వెంకటరావు, పార్టీ నాయకులు పామర్తి సత్తిబాబు, వల్లభనేని రంగబాబు, పెద్దిబోయిన రాజు, కంచర్ల ప్రకాష్‌, పెన్నేరు రమేష్‌, గరికిపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *