
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అనంతపురం జిల్లాలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాజకీయ వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వైసీపీ శ్రేణులు దౌర్జన్యాలకు పాల్పడ్డాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.
మరుట్లలో బ్యాలెట్ బాక్సు ధ్వంసం
కూడేరు మండలం మరుట్లలోని పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ నేతలు పోలింగ్ బూత్‌లో ఉన్న బ్యాలెట్ బాక్సును బయటకు తీసుకొచ్చి రాళ్లతో ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా దాడి జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు.
For more: MPTC, ZPTC Elections Live Updates in DTV Digital
పోలేపల్లి, చిందర్లపల్లిలోనూ ఘర్షణలు
జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఘర్షణలు జరిగినట్లు తెలుస్తోంది. బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లిలో పోలింగ్ కేంద్రం వెలుపల ఉన్న టీడీపీ కార్యకర్తలపై దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
అలాగే శెట్టూరు మండలం చిందర్లపల్లిలో కొందరు వ్యక్తులు పోలింగ్ కేంద్రంలోకి చొరబడి టీడీపీ ఏజెంట్లపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడిన అమిలినేని యశ్వంత్ అనే కార్యకర్తను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
వరుస ఘటనలతో జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనలపై పోలీసులు తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉంది.
