
తల్లికి వందనం నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. సీఎం చంద్రబాబుకు ప్రశ్నల వర్షం కురిపించారు. యూడైస్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే.. కేవలం 67 లక్షల మందికే ఇవ్వడం అన్యాయమని మండిపడ్డారు. రూ.15 వేలు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు రూ.13 వేలు మాత్రమే ఇవ్వటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోత పెట్టకుండా అర్హులైన విద్యార్థులు అందరికీ రూ.15 వేలు అందించాలని డిమాండ్ చేశారు.
తల్లికి వందనానికి పంగనామం-బిడ్డలకు ఎగనామం” ఇదే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీ. వైసీపీ మోసాలను తూ.చా. తప్పకుండా పాటించడం కూటమి ప్రభుత్వ విధానం. అమ్మఒడి పథకాన్ని వైసీపీ ప్రభుత్వం ఒక్క బిడ్డకే ఇచ్చి తల్లులను పచ్చిమోసం చేస్తే, నీకు 15 , నీకు 15, ఎంతమంది ఉంటే అన్ని 15 వేలు అని చెప్పిన చంద్రబాబు గారు.. ఇప్పుడు తల్లులను నయవంచన చేస్తున్నారు. కోతల రాయుడు కోతలని ఎద్దేవా చేసిన బాబుగారే మళ్లీ కోతలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ” అంటూ షర్మిల విమర్శలు గుప్పించారు.
ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం, సీఎం నారా చంద్రబాబు నాయుడుకు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు.” రాష్ట్రంలో 83 లక్షల మంది విద్యార్థులు ఉంటే ఎంతమందికి ఇస్తున్నారు ? 15 వేల చొప్పున ఇస్తామని చెప్పి 2 వేల చొప్పున ఎందుకు కోతలు పెడుతున్నారు ? 300 యూనిట్లు కరెంట్ వాడారని పథకానికి అనర్హులు చేస్తారా ? కారు( జీవనోపాధి కోసం) ఉందని బిడ్డలకు పథకం నుంచి దూరం చేస్తారా ? అమ్మఒడి అంటూ నాన్న బుడ్డీ దోపిడీనా ?” అంటూ 2023లో అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారని షర్మిల గుర్తు చేశారు.

