
జన్యుపరమైన ఎముకల వ్యాధితో బాధపడుతూ నిలబడలేక, నడవలేక ఇబ్బంది పడుతున్న 18 నెలల ఏనుగు పిల్లకు మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు కీలక చర్యలు చేపట్టారు. సుమారు 125 నుంచి 130 కిలోల బరువున్న ఈ ఏనుగు పిల్లను ప్రత్యేక విమానంలో కేరళ నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు తరలించారు. అక్కడ రిలయన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వంతార (Vantara) జంతు సంరక్షణ కేంద్రంలో అత్యాధునిక చికిత్స అందించనున్నారు. నవంబర్ 6, శుక్రవారం ఈ తరలింపు ప్రక్రియ చేపట్టారు.
క్రేన్ సాయంతో ప్రత్యేక అంబులెన్స్‌లోకి..
కేరళలోని కోడనాడ్ ఏనుగుల సంరక్షణ కేంద్రంలో ఉంటున్న ఈ ఏనుగు పిల్లను తరలించడం అధికారులకు సవాలుగా మారింది. అది సొంతంగా నిలబడలేని పరిస్థితిలో ఉండటంతో 10 నుంచి 12 మంది సిబ్బంది క్రేన్ సహాయంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జంతు అంబులెన్స్‌లోకి ఎక్కించారు.
అనంతరం అక్కడి నుంచి నెడుంబస్సేరి విమానాశ్రయానికి తరలించారు. పశువైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో ప్రత్యేక చార్టర్డ్ విమానం ద్వారా జామ్‌నగర్‌లోని వంతారకు తీసుకెళ్లారు.
పుట్టుకతోనే ఆరోగ్య సమస్యలు
ఈ ఏనుగు పిల్లను పుట్టిన వెంటనే చికిత్స, సంరక్షణ కోసం కోడనాడ్ కేంద్రానికి తీసుకొచ్చారు. అయితే ఒకసారి కిందపడిన తర్వాత దాని ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు కీలక విషయాలను గుర్తించారు.
జన్యుపరమైన ఎముకల సమస్యలతో పాటు ఆస్టియోపీనియా వంటి వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు. ఈ సమస్య కారణంగా ఎముకలు బలహీనపడటంతో ఏనుగు పిల్ల నిలబడటం, నడవటం కష్టంగా మారింది.
నాలుగు నుంచి ఆరు నెలల పాటు చికిత్స
వంతారలో ప్రత్యేక వైద్య బృందం ఈ ఏనుగు పిల్లకు చికిత్స అందించనుంది. ఇందులో హార్మోన్ల చికిత్సతో పాటు హైడ్రోథెరపీ (జలచికిత్స) కూడా భాగంగా ఉండనుంది. చికిత్సకు ఏనుగు పిల్ల స్పందించే తీరును బట్టి నాలుగు నుంచి ఆరు నెలల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చును వంతార సంస్థ భరించేందుకు ముందుకొచ్చింది. చికిత్స పూర్తయ్యే వరకు కేరళకు చెందిన మావటి కూడా ఏనుగు పిల్లతోనే ఉండనున్నారు. అంతేకాకుండా సహాయ అటవీ పశువైద్య అధికారి సహా అటవీ శాఖ అధికారులు వంతారను సందర్శిస్తూ దాని ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించనున్నారు.
MPTC, ZPTC Elections Live Updates in DTV Digital
కోలుకుని తిరిగి నడవగలదా?
తీవ్రమైన ఎముకల సమస్యతో బాధపడుతున్న ఈ చిన్న ఏనుగు తిరిగి కోలుకుని తన కాళ్లపై తాను నిలబడగలదా అన్నది ఆసక్తికరంగా మారింది. వంతారలో అందించనున్న ప్రత్యేక వైద్యం, నిరంతర సంరక్షణతో అది త్వరగా కోలుకోవాలని జంతు ప్రేమికులు ఆకాంక్షిస్తున్నారు.
