
బైక్ ర్యాలీల పేరుతో వైసీపీ నేతలు వికృత చేష్టలకు పాల్పడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మంగళవారం మచిలీపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేపట్టిన నిరసన దీక్షలు బైక్ ర్యాలీలపై ఆయన స్పందించారు.
వైసీపీ నిర్వహించిన ర్యాలీల్లో రౌడీలు, గంజాయి బ్యాచ్లు పాల్గొన్నాయని మంత్రి ఆరోపించారు. ఆ నిరసన కార్యక్రమాల్లో రైతులు విద్యార్థులు ఎక్కడా కనిపించలేదన్నారు. యువతను నిర్వీర్యం చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని విమర్శించారు.
మెగా డీఎస్సీ ద్వారా 16 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తే అక్రమాలు జరిగాయని ఆరోపించడం సిగ్గుచేటని కొల్లు రవీంద్ర అన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో కనీసం ఒక్క మెగా డీఎస్సీ అయినా నిర్వహించారా? అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ను ప్రశ్నించారు.
వైసీపీ పిలుపునిచ్చే నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచి స్పందన కరువైందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశామని తెలిపారు. ప్రతినెలా పెన్షన్లు అందిస్తున్నామని తల్లికి వందనం పథకాన్ని అమలు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర గుర్తు చేశారు.

