
రాజమండ్రి పేరు రాజమహేంద్రవరంగా మార్చాలనే డిమాండ్ మళ్ళీ తెరపైకి వచ్చింది. పదేళ్ల క్రితం మార్చినా, కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో మారకపోవడంతో రైల్వే, పోస్టల్ వంటి చోట్ల పాత పేరే కొనసాగుతోంది. దీంతో ప్రజలు రెండు పేర్లతో ఇబ్బందులు పడుతున్నారు. కొత్త ప్రభుత్వం ఈ గందరగోళాన్ని పరిష్కరించి, అధికారికంగా రాజమహేంద్రవరంగా మార్చాలని కోరుతున్నారు. ఇంతకీ ఈ పేరుపై ఎందుకీ గందరగోళం.. కేంద్రం అలా, రాష్ట్రం ఇలా ఎందుకు
ఏపీలో ఆ నగరం పేరు మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరం పేరు రాజమహేంద్రవరంగా పదేళ్ల క్రితం మార్చారు. చారిత్రక విశిష్టత ఉన్న రాజమండ్రిని, రాజరాజనరేంద్రుడు పాలించిన ప్రాంతంగా గుర్తించి.. నగరానికి రాజమహేంద్రవరంగా పేరు మార్చాలని చాలామంది ప్రముఖులు, నగర అభిమానులు గతంలో కోరారు. వారి విజ్ఞప్తులకు స్పందించి 2015లో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నగరం పేరును రాజమహేంద్రవరంగా మారుస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత, ఆర్టీసీ బస్టాండ్లు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉన్న నామఫలకాలన్నీ కొత్త పేరుతో మార్చారు. అయితే నగరం పేరు రాష్ట్ర ప్రభుత్వ గెజిట్‌లో మారినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో ఇంకా మారలేదని అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే రైల్వేస్టేషన్, తపాలా కార్యాలయాల్లో పాత పేర్లతోనే కొనసాగుతున్నాయి. 2015లో ఈ మార్పును ప్రకటించినా.. కేంద్రం గెజిట్‌లో పేరు మారకపోవడమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. కేంద్ర సంస్థలు రాజమండ్రి అని పిలుస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం రాజమహేంద్రవరమని సంభోదిస్తోంది. రాష్ట్రానికి ఒక పేరు ఉంటే.. కేంద్రానికి మరో పేరు ఉంటోంది.
