
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలోని విద్యాసంస్థలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం రూ.118.89 కోట్ల నిధులను కేటాయించి, డిజిటల్ తరగతి గదులు, కొత్త హాస్టల్ బ్లాకులు, మౌలిక వసతుల మెరుగుదల వంటి పనులను చేపట్టనున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో 33 విద్యాసంస్థల్లో చదువుతున్న 21,580 మంది విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
టీటీడీ ఆధీనంలోని విద్యాసంస్థల్లో కార్పొరేట్ స్థాయి సదుపాయాలు, ఆధునిక బోధనా విధానాలను అమలు చేయాలనే దిశగా ఏపీ ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం టీటీడీ పరిధిలో 33 విద్యాసంస్థలు ఉండగా, వాటిలో మొత్తం 21,580 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో 10,261 మంది హాస్టల్ వసతులను పొందుతున్నారు. ఇటీవల టీటీడీ విద్యాసంస్థల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి సూచనల మేరకు టీటీడీ విద్యాసంస్థల్లో సమగ్ర మార్పులు తీసుకురావడానికి పాలకమండలి చర్యలు ప్రారంభించింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.118.89 కోట్ల నిధులను కేటాయించింది. టీటీడీ చరిత్రలో విద్యాసంస్థల అభివృద్ధికి ఇంత భారీ మొత్తాన్ని కేటాయించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ నిధులతో ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
ప్రస్తుతం టీటీడీ ఆధ్వర్యంలోని పలు విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కొరత విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. హాస్టళ్లలో వేడి నీరు, సరైన మరుగుదొడ్లు, వంటసామగ్రి వంటి కనీస వసతులు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. అలాగే టీటీడీ కాలేజీల్లో డిజిటల్ తరగతి గదులు కూడా లేకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం జేఈవో శరత్ విద్యా సబ్‌కమిటీతో కలిసి ఈ లోపాలను గుర్తించి, వాటి పరిష్కారానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేశారు.
ఎస్వీ విద్యాదాన ట్రస్ట్ మరియు టీటీడీ నిధులను సమన్వయం చేస్తూ ఈ ఏడాది రూ.118.89 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. విద్యాసంస్థల్లో సాంకేతిక ఆధారిత బోధనకు ప్రాధాన్యం ఇస్తూ డిజిటల్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందించడంతో పాటు నైపుణ్యాభివృద్ధి కోర్సులను కూడా ప్రవేశపెట్టనున్నారు.
బోధన మరియు బోధనేతర సిబ్బందికి ఆధునిక సాంకేతికతపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అదనపు తరగతి గదులు, కొత్త హాస్టల్ బ్లాకులు నిర్మించనున్నారు. ముఖ్యంగా శ్రీ పద్మావతి మహిళా విద్యాసంస్థల్లో విద్యార్థినుల ఆరోగ్యం, భద్రతపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో పర్యవేక్షణలో ఈ సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు త్వరలోనే అమలులోకి రానున్నాయి. ఈ చర్యలతో టీటీడీ విద్యాసంస్థల్లో ఆధునిక సదుపాయాలు ఏర్పడి విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించనున్నాయి.

