మన ఇళ్లలో కొబ్బరికాయలు వాడిన తర్వాత వాటి చిప్పలు, పీచును సాధారణంగా చెత్తలో పడేస్తుంటాం. అయితే, కొబ్బరి పీచును ఒకప్పుడు గిన్నెలు తోమడానికి ఉపయోగించేవారు. అంతేకాదు.. ఈ పీచుతో ఎన్నో ఉపయోగకరమైన వస్తువులు తయారుచేయొచ్చు. వాటిలో ముఖ్యమైనది కొకోపీట్. కొబ్బరి పీచు, పొట్టు నుంచి తయారయ్యే సహజమైన సేంద్రియ పదార్థమే కొకోపీట్. మొక్కలు, కూరగాయలు, పూల మొక్కల పెంపకంలో దీనిని విరివిగా ఉపయోగిస్తారు. మరి ఇంట్లోనే కొబ్బరి పీచుతో కొకోపీట్‌ను సులభంగా ఎలా తయారుచేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

కొకోపీట్ గురించి మొక్కలను పెంచేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొక్కల పెంపకంలో ఇది మట్టికి మంచి ప్రత్యామ్నాయంగా, తేమను నిలుపుకునే పదార్థంగా ఉపయోగపడుతుంది. స్పాంజ్‌లా పనిచేస్తూ నీటిని కొంతసేపు నిల్వ ఉంచుతుంది. అలాగే మట్టిని గుల్లగా, గాలి ప్రసరణకు అనుకూలంగా ఉంచి మొక్కల వేర్లకు నీరు, గాలి సరిగ్గా అందేలా సహాయపడుతుంది.
రూఫ్ గార్డెన్లు, వేలాడే కుండీలు, బాల్కనీ గార్డెన్లలో కొకోపీట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది తేలికగా ఉండటంతో కుండీల బరువును పెద్దగా పెంచదు. విత్తనాలు మొలకెత్తే సమయంలో తేమను నిలుపుకోవడంతో మొక్కల ప్రారంభ పెరుగుదలకు కూడా అనుకూలంగా ఉంటుంది.
సాధారణంగా కొబ్బరి పీచు నుంచి మిగిలే వ్యర్థ పదార్థంతో కొకోపీట్‌ను తయారు చేస్తారు. అయితే మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండానే ఇంట్లో పారేసే కొబ్బరి పీచుతో కూడా దీనిని తయారు చేసుకోవచ్చు.
కొకోపీట్ తయారీకి కావాల్సిన పదార్థాలు
- కొబ్బరి చిప్పలు
- గ్రైండర్
- జల్లెడ
- రోలు
- కత్తెర
ఏం చేయాలి?
- ముందుగా కొబ్బరి చిప్పల్ని బాగా ఎండబెట్టాలి. పీచుని కూడా ఆరబెట్టాలి. తర్వాత అన్నింటిని చిన్న ముక్కలుగా పగలగొట్టాలి. పీచుని కూడా చిన్న ముక్కలుగా విరగొట్టాలి.
- అయితే, కొబ్బరి ముక్కలు కాస్తా గట్టిగా ఉంటాయి. వాటిని రోలులోనే దంచాలి. గ్రైండర్‌లో వేస్తే పాడైపోతాయని అర్థం చేసుకోవాలి. రోలు వాడడం వీలు కాని వారు కేవలం పీచుతోనే తయారుచేయొచ్చు.
మిక్సీ పట్టుకోవడం
ఇప్పుడు పీచుని కత్తెర సాయంతో చిన్న ముక్కలుగా కట్ చేయాలి. దీనినంతటిని మనం మిక్సీ జార్‌లో వేసి మిక్సీ పట్టాలి. అయితే పీచు మొత్తం చక్కగా ఎండితేనే ఎలాంటి నార లేకుండా చక్కగా పౌడర్‌లా మారుతుంది. లేదంటే తీగల్లా వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇలా పొడిలా మారిన కొకోపీట్‌ని మిక్సీ పట్టుకుని జల్లించుకోవాలి. దీంతో ఎక్కువగా నారలు లేకుండా ఉంటుంది.
నానబెట్టడం
తయారైన కొకోపీట్ పౌడర్‌ను ముందుగా సుమారు గంటపాటు నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల అందులో ఏమైనా మలినాలు ఉంటే తొలగిపోతాయి. అయితే ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. గంట తర్వాత కొకోపీట్‌ను బయటకు తీసి, అందులోని నీటిని పూర్తిగా పిండేయాలి. అనంతరం తేమ తగ్గిన గుజ్జును ఎండలో బాగా ఆరబెట్టాలి. పూర్తిగా ఆరిన తర్వాత కొకోపీట్ సిద్ధమైనట్లే.
కొందరు కొకోపీట్‌ను మిక్సీలో వేసి మెత్తగా చేసి, నేరుగా కూడా ఉపయోగిస్తారు. అలా వాడటం కూడా సాధ్యమే. అయితే నీటిలో నానబెట్టి, పిండేసి, ఆరబెట్టిన కొకోపీట్‌కు.. నేరుగా పొడి చేసిన కొకోపీట్‌కు కొంత తేడా ఉంటుంది.
ఎలా వాడాలి.
అయితే, ఇలా తయారుచేసుకున్న కొకోపీట్‌లోనే నేరుగా మొక్కలను నాటకూడదు. కొకోపీట్ ప్రధానంగా నీటిని నిల్వ ఉంచేందుకు, మట్టిని గుల్లగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో మొక్కలకు అవసరమైన పోషకాలు తగినంతగా ఉండవు. అందుకే దీనిని మట్టి, కంపోస్ట్ లేదా సేంద్రియ ఎరువులతో కలిపి ఉపయోగించడం మంచిది. సాధారణంగా 50 శాతం మట్టి, 30 శాతం కొకోపీట్, 20 శాతం కంపోస్ట్ లేదా ఎరువులు కలిపి మిశ్రమాన్ని తయారుచేసుకోవచ్చు. ఈ మిశ్రమంలో మొక్కలు నాటితే వేర్లకు గాలి, తేమ అందడంతో పాటు అవసరమైన పోషకాలు కూడా లభిస్తాయి. విత్తనాలు మొలకెత్తడానికి, మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది.
కొకోపీట్‌తో లాభాలు
ముందుగా చెప్పుకున్నట్లుగా కొకోపీట్ నీటిని ఎక్కువగా పీల్చుకుని, కొంతకాలం తేమను నిలుపుకుంటుంది. అందుకే ప్రతిరోజూ నీరు పోయాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా చలికాలంలో రెండు మూడు రోజులకు ఒకసారి నీరు పోసినా సరిపోతుంది. కొకోపీట్‌తో మొక్కలు పెంచడం వల్ల మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
- చాలా తేలికగా ఉంటుంది: కొకోపీట్ బరువు తక్కువగా ఉండటంతో టెర్రస్ గార్డెనింగ్, వేలాడే కుండీల్లో మొక్కలు పెంచేందుకు అనుకూలంగా ఉంటుంది.
- వేర్లకు గాలి అందుతుంది: కొకోపీట్ గుల్లగా ఉండటంతో వేర్ల చుట్టూ గాలి ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. దీంతో వేర్లు ఆరోగ్యంగా విస్తరించేందుకు సహాయపడుతుంది.
- స్వల్ప ఆమ్లత్వం: సాధారణంగా కొకోపీట్ పీహెచ్ సుమారు 5.5 నుంచి 6.5 మధ్యలో ఉంటుంది. ఈ పరిధి చాలా మొక్కలకు అనుకూలంగా ఉంటుంది.
- విత్తనాల మొలకలకు అనుకూలం: చిన్న విత్తనాలు మొలకెత్తేందుకు అవసరమైన తేమను నిలుపుకోవడం వల్ల కొకోపీట్ సీడ్ జర్మినేషన్‌కు ఉపయోగపడుతుంది.
- పారుదల, గాలి ప్రసరణకు మేలు: కొకోపీట్ నీటిని నిలుపుకోవడంతో పాటు అదనపు నీరు బయటకు వెళ్లేలా చేసి, వేర్ల చుట్టూ గాలి ప్రసరణకు సహాయపడుతుంది.
- మళ్లీ ఉపయోగించుకోవచ్చు: సరిగ్గా శుభ్రం చేసి, ఎండబెట్టి, అవసరమైనప్పుడు మళ్లీ ఉపయోగించుకోవచ్చు. అయితే ఎంతకాలం ఉపయోగించవచ్చనేది దాని నాణ్యత, వినియోగం, సంరక్షణపై ఆధారపడి ఉంటుంది.
- కొబ్బరి పీచుకు ఉపయోగం: సాధారణంగా వ్యర్థంగా పారేసే కొబ్బరి పీచును ఉపయోగకరమైన కొకోపీట్‌గా మార్చుకోవచ్చు.
- ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు: ఇన్ని ప్రయోజనాలు ఉన్న కొకోపీట్‌ను కొబ్బరి పీచుతో ఇంట్లోనే తయారు చేసుకుని, తగిన మట్టి లేదా ఇతర పెరుగుదల మాధ్యమాలతో కలిపి మొక్కల పెంపకంలో ఉపయోగించుకోవచ్చు.
