తేజ సజ్జ హీరోగా తెరకెక్కుతున్న **‘జాంబీ రెడ్డి 2 NXT LVL’**పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ‘హనుమాన్’కు ముందు తేజ సజ్జ కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ‘జాంబీ రెడ్డి’కి ఇది సీక్వెల్. తాజాగా కన్నడ స్టార్ ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఉపేంద్ర పూర్తిగా భిన్నమైన, రగ్గడ్ లుక్‌లో కనిపించడంతో సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది.

ఫస్ట్ లుక్‌లో ఉపేంద్ర ఓ భారీ చెట్టు కొమ్మకు తలకిందులుగా వేలాడుతూ, చేతిలో ప్రత్యేకమైన ఆయుధంతో కనిపించారు. పొడవాటి జుట్టు, డార్క్ కాస్ట్యూమ్, అడవి నేపథ్యం వంటి అంశాలతో పోస్టర్‌ను డిజైన్ చేశారు. ‘Ready to Turn the World Upside Down’ అనే ట్యాగ్‌లైన్‌తో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తిని పెంచారు. అయితే ఉపేంద్ర పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ ఇంకా వెల్లడించలేదు.

ఈ సీక్వెల్‌కు మొదటి భాగాన్ని రూపొందించిన ప్రశాంత్ వర్మ క్రియేటర్‌గా వ్యవహరిస్తుండగా.. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘రానా నాయుడు’ ఫేమ్ సుపర్ణ్ ఎస్. వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటి షనాయా కపూర్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానుంది.

మొదటి భాగం రాయలసీమ నేపథ్యంలో సాగగా.. సీక్వెల్ కథ హైదరాబాద్ నేపథ్యంలో ఉండనుందని టైటిల్ అనౌన్స్‌మెంట్ సమయంలోనే సూచించారు. చార్మినార్ వంటి నగరంలోని ప్రముఖ లొకేషన్లు కూడా వీడియోలో కనిపించాయి. ఈసారి జాంబీ ప్రపంచాన్ని మరింత పెద్ద స్థాయిలో చూపించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గౌర హరి సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, నేపాలీ, జపనీస్ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. 2027లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

తేజ సజ్జతో పాటు ఉపేంద్ర, షనాయా కపూర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి జాంబీ ప్రపంచాన్ని చూపించబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఉపేంద్ర ఫస్ట్ లుక్‌తో ఆయన పాత్రపై క్యూరియాసిటీ మరింత పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *