శుభ్రమైన, కాంతివంతమైన చర్మం కోసం ప్రతిరోజూ ముఖాన్ని శుభ్రం చేసుకోవడం ఎంతో ముఖ్యం. సాధారణంగా రోజుకు రెండుసార్లు ముఖం కడుక్కోవడం వల్ల చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, మలినాలు తొలగి ఫ్రెష్‌గా కనిపిస్తుంది. ఇందుకోసం చాలామంది మార్కెట్లో దొరికే ఫేస్‌వాష్‌లను ఉపయోగిస్తుంటారు. అయితే, కొన్ని ఉత్పత్తుల్లోని పదార్థాలు సున్నితమైన చర్మానికి చికాకు, పొడిబారడం లేదా మొటిమలు వంటి సమస్యలను కలిగించవచ్చు.

ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో లభించే సహజ పదార్థాలతో తయారు చేసుకునే ఫేస్‌వాష్‌లను ప్రయత్నించవచ్చు. ఇవి చర్మాన్ని సున్నితంగా శుభ్రం చేయడంలో సహాయపడతాయి. అయితే సహజ పదార్థాల వల్ల కూడా అందరికీ ఒకే విధమైన ఫలితం ఉండకపోవచ్చు. కాబట్టి ముందుగా చర్మంలోని చిన్న భాగంపై పరీక్షించి, ఏదైనా దురద, మంట లేదా దద్దుర్లు వస్తే వెంటనే వాడటం ఆపాలి. ఇంట్లోనే సహజమైన ఫేస్‌వాష్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుత కాలంలో మార్కెట్లో లభించే అనేక రకాల ఫేస్‌వాష్‌లలో పారాబెన్లు, సల్ఫేట్లు వంటి రసాయనాలు ఉంటున్నాయి. ఇవి తాత్కాలికంగా చర్మాన్ని శుభ్రం చేసినప్పటికీ, తరచుగా ఉపయోగిస్తే చర్మంలోని సహజ తేమ తగ్గి పొడిబారే అవకాశం ఉంది. అందుకే ఇంట్లోనే లభించే సహజ పదార్థాలతో సింపుల్‌గా హోమ్‌మేడ్ ఫేస్‌వాష్‌ను తయారు చేసుకోవచ్చు. ఈ సహజ ఫేస్‌వాష్‌కు అవసరమైన పదార్థాలు, తయారీ విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

– శనగ పిండి

– చందనం పొడి

– ముల్తానీ మిట్టి

– కస్తూరి పసుపు

– బియ్యపు పిండి

ఇంట్లోనే ఈ సహజమైన ఫేస్ వాష్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలో 2 టీస్పూన్ల శనగపిండి, 2 టీస్పూన్ల గంధపు పొడి, 1 టీస్పూన్ ముల్తానీ మట్టి, 1 టీస్పూన్ కస్తూరి పసుపు, 1 టీస్పూన్ బియ్యప్పిండి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు.

ఉపయోగించే సమయంలో ఈ పొడిలో 2 టీస్పూన్లు తీసుకుని, చర్మ తత్వాన్ని బట్టి పాలు, పెరుగు లేదా రోజ్ వాటర్‌ కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. చివరగా కొద్దిగా తేనె లేదా కలబంద జెల్‌ కలిపితే సహజమైన ఫేస్ వాష్ సిద్ధమవుతుంది. ఈ మిశ్రమాన్ని ముఖంపై సున్నితంగా రాసి, కొద్దిసేపటి తర్వాత నీటితో కడిగేయాలి.

ముందుగా ముఖాన్ని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖం, మెడపై పలుచగా రాసి, వృత్తాకారంలో 1–2 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత చల్లని లేదా సాధారణ నీటితో ముఖాన్ని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి.

హోమ్‌మేడ్ ఫేస్‌వాష్ ప్రయోజనాలు

ఈ సహజ ఫేస్‌వాష్‌లోని పదార్థాలు చర్మంపై పేరుకున్న మురికి, అదనపు నూనెను తొలగించి ముఖాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం తాజాగా, కాంతివంతంగా కనిపించవచ్చు. టానింగ్ తగ్గడంతో చర్మ ఛాయ కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. అయితే, సహజ పదార్థాలైనా ప్రతి ఒక్కరి చర్మానికి ఒకే విధంగా సరిపోవు. అందుకే ఉపయోగించే ముందు తప్పనిసరిగా ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. చర్మానికి ఎలాంటి అసౌకర్యం కలిగితే వాడటం నిలిపివేయాలి.