
భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌లో ఆటగాడిగా తన సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలకడంతో అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. దాదాపు 19 ఏళ్ల పాటు కెప్టెన్‌గా, బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా ఎన్నో విజయాల్లో భాగమైన మహీ.. ఇకపై మైదానంలో ఆటగాడిగా కనిపించనున్నాడు. అయితే చెన్నై సూపర్ కింగ్స్‌కు మెంటార్‌గా తన అనుభవాన్ని పంచుకోనున్నాడు. ఈ నేపథ్యంలో ధోనీ సతీమణి సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. జీవితంలో కొత్త, అందమైన ప్రయాణాలు మొదలవ్వాలంటే కొన్ని పాత అధ్యాయాలకు ముగింపు పలకాల్సిందేనంటూ తన మనసులోని భావాలను పంచుకున్నారు.
‘మహీ.. నిన్ను చూసి గర్వంగా ఉంది’
సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పర్వతాల వైపు చూస్తూ నిల్చున్న ధోనీ ఫొటోను షేర్ చేశారు. దీనికి భావోద్వేగంతో కూడిన క్యాప్షన్ జోడించారు. ఇన్నేళ్లుగా మహీని ప్రేమించి, నమ్మకంతో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు అందించిన ప్రేమ, మద్దతును ఎప్పటికీ మర్చిపోలేమని పేర్కొన్నారు.
కొత్త ఆరంభాలు, సరికొత్త సాహసాలు, మరెన్నో మధుర జ్ఞాపకాలకు స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. చివరగా ‘మహీ.. నిన్ను చూసి ఎంతో గర్వపడుతున్నా’ అంటూ తన ప్రేమను వ్యక్తం చేశారు. సాక్షి షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధోనీ అభిమానులు సైతం ఈ భావోద్వేగ క్షణంపై స్పందిస్తున్నారు.
హోటల్ పరిచయం నుంచి ప్రేమ వరకు..
ధోనీ, సాక్షి పరిచయం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. కోల్‌కతాలోని తాజ్ హోటల్‌లో వీరిద్దరి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. చివరకు 2010లో ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
ధోనీ, సాక్షి ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమా కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో వారి పరిచయం, ప్రేమ, జీవితంలోని కీలక ఘట్టాలను చూపించారు. ఇప్పుడు ధోనీ ఐపీఎల్‌కు ఆటగాడిగా వీడ్కోలు పలికిన సమయంలో సాక్షి చేసిన పోస్ట్ మరోసారి వారి అనుబంధాన్ని అభిమానులకు గుర్తుచేస్తోంది.
https://www.instagram.com/p/Df2BFwMyvxY/?utm_source=ig_web_copy_link&hvrq=NTc4MTIwNjQ2YQ==
